సీఎం నివాసం గ్రామకంఠం కాదట

4 Mar, 2016 04:31 IST|Sakshi
సీఎం నివాసం గ్రామకంఠం కాదట

* కోర్టు భయంతో ప్లేటు ఫిరాయించిన సీఆర్‌డీఏ
* గతంలో గ్రామకంఠమంటూ మాస్టర్‌ప్లాన్‌లో చేర్పు
* క్విడ్‌ప్రోకో వ్యవహారం బయటపడటంతో రూటు మార్పు

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్న అక్రమ భవనాన్ని సక్రమం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేసిన సీఆర్‌డీఏ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించింది. భవనం సక్రమమేనని చూపేందుకు ఏకంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో దాన్ని గ్రామకంఠం పరిధిలో చేర్చి.. ఆనక కోర్టు భయంతో వెనక్కి తగ్గింది.

ముఖ్యమంత్రి నివాస భవనంతోపాటు ఆయన కుమారుడు లోకేశ్, మరికొందరు పెద్దల భవనాలను గ్రామకంఠాల నుంచి మినహాయిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు ఆ భవనం స్వాధీనం వెనుక సీఎంకు, లింగమనేని ఎస్టేట్స్‌కు మధ్య క్విడ్‌ప్రోకో జరిగినట్లు బయటపడడంతో సీఆర్‌డీఏ  రూటు మార్చింది.
 
అక్రమమేనన్న జలవనరుల శాఖ
మంగళగరి మండలం ఉండవల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కృష్ణానదికి ఆనుకుని లింగమనేని ఎస్టేట్స్ కంపెనీకి చెందిన అతిథి గృహాన్ని కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి తన నివాసంగా మార్చుకున్న విషయం తెలిసిందే. సర్వే నంబరు 274లో ఈ భవనం ఉంది. నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించారని గతంలో మంగళగరి తహసీల్దార్ ఈ భవన యజమానికి నోటీసులు కూడా జారీ చేశారు. దీంతోపాటు నదికి ఆనుకున్న ఉన్న 22 ఇతర భవనాల యజమానులకూ నోటీసులు ఇచ్చారు.

జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వయంగా కృష్ణానదిలో బోటు వేసుకుని విలేకరుల బృందాన్ని తన వెంటబెట్టుకుని వెళ్లి ఆభవనాలన్నీ అక్రమమని తేల్చారు. ఆ తర్వాతే లింగమనేని అతిథి గృహంతో పాటు మిగిలినవన్నీ అక్రమ కట్టడాలని జలవనరుల శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ నివేదికను ప్రభుత్వం తొక్కిపట్టింది. అక్రమమని నిర్థారించిన అదే భవనాన్ని అనూహ్యంగా సీఎం చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. దీనితో లింగమనేని గ్రూపునకు భారీగా లబ్ధి కలిగించినట్లు తేటతెల్లమైంది. ఆ తర్వాత బాబు ఉండడానికి అనువుగా కోట్ల రూపాయలతో ఆ భవంతిని ఆధునీకరించారు. అంతేగాక ఆ భవంతి కోసమని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త విద్యుత్ లైన్లు, రోడ్లు వేశారు.
 
సక్రమం చేయడానికి గ్రామకంఠంలోకి..
ఈ క్రమంలోనే ఆ అక్రమ భవనాన్ని ఉండవల్లి గ్రామకంఠం పరిధిలో చేర్చారు. ఆర్1 (రెసిడెన్షియల్ జోన్) గ్రామకంఠంలోని నివాస సముదాయంగా మార్చడం ద్వారా పూర్తిగా దాన్ని సక్రమంగా చూపించాలని నిర్ణయించారు. అభ్యంతరాల స్వీకరణ ముగిసిన తర్వాత తుది మాస్టర్‌ప్లాన్‌లో దీనికి ఆమోదముద్ర వేసి అక్రమ భవనాన్ని సక్రమం చేసేశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి నివాసం పక్కనే సర్వే నంబరు 250లో ఆయనకోసం ఏర్పాటుచేసిన హెలీప్యాడ్, ఆయన కుమారుడు లోకేశ్ నివాసం ఉంటున్న సర్వే నంబరు 277లోని భవనం, సర్వే నంబరు 222లో ఉన్న నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అతిథిగృహం, 233 సర్వే నంబర్లోని ఆక్వా డెవిల్స్ భవనాలను తుది మాస్టర్‌ప్లాన్‌లో గ్రామకంఠాల పరిధిలో చేర్చారు. వీటితో పాటు 270, 279, 277, 274, 250, 243, 222, 223, 33, 35, 31 సర్వే నంబర్లలో ఉన్న ప్రముఖుల భవనాలను సైతం గ్రామకంఠాలుగా మార్చేశారు. దీంతో గతంలో అక్రమమని ప్రభుత్వం నిర్ధారించిన భవనాలే ప్రభుత్వ పెద్దల కోసం ఏకంగా గ్రామకంఠంలో వచ్చి చేరాయి.
 
హైకోర్టు ఆదేశాలతో కలవరం..
నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన కట్టడంలో నివాసం ఉండటం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షాలు ప్రశ్నించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ అక్రమ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించడంతో సీఆర్‌డీఏ కలవరపడింది. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఒక్కసారిగా ప్రభుత్వ పెద్దలు గుడ్లు తేలేశారు.

కోర్టులో ఈ భవనం అక్రమమని తేలిపోతుందని, దీంతో ముఖ్యమంత్రి సహా అందరూ దొరికిపోతారనే భయం మొదలైంది. ఈ భయంతోనే తెల్లారేసరికి భవనాలన్నింటినీ గ్రామకంఠాల నుంచి మినహాయిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యమంత్రి నివాసాన్ని గ్రామకంఠం నుంచి ఖాళీ స్థలం, రిక్రియేషనల్ అవసరాలకు వినియోగించే కేటగిరీలో చేర్చారు. మిగిలిన భవనాలను ఎస్2 విద్యాజోనులోకి మార్చారు. కోర్టుకు అడ్డంగా దొరికిపోతామనే భయంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఇలా ప్లేటు మార్చింది. దీంతో ఇప్పటివరకూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజమేనని ప్రభుత్వమే అంగీకరించినట్లయింది.

మరిన్ని వార్తలు