ఉత్కంఠకు తెర!

2 Aug, 2018 11:06 IST|Sakshi
పంగులూరు గ్రామం వ్యూ

ఒంగోలు టూటౌన్‌: ప్రభుత్వం నిర్ణయం పంచాయతీ పాలకవర్గాలకు నిరాశే మిగిల్చింది. సర్పంచులను పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమిస్తారన్న ఆశలు ఆడియాశలయ్యాయి. సర్పంచుల సంఘం హైకోర్టుకెళ్లి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రత్యేక అధికారుల నియామకానికే సర్కారు మొగ్గు చూపింది. అనుకున్నదే తడవుగా వెంటనే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని బుధవారం జీవో 269  కూడా జారీ చేసింది. దీంతో గురువారం నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ప్రత్యేక అధికారుల నియామకంపై జిల్లా అధికారులు వెంటనే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కంటే ముందే రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రత్యేక అధికారుల నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో స్థానిక సంస్థల్లో ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
 
జిల్లాలోని 1028 గ్రామ పంచాయతీల్లో సకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయించింది. అయినా సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లోతీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేసింది. దీంతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసే వరకు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసింది. పాలక వర్గాల గుడువు ముగిసే రోజున ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గు చూపింది.

 రూ.150 కోట్ల నిధులకు గండి...
ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితి రానుంది. పంచాయతీ పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. కాని ప్రస్తుత పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడానికే మొగ్గు చూపింది. దీంతో ఏటా గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఇక నిలిచిపోనున్నాయి. దాదాపు ఏటా రూ.150 కోట్లకు పైగా నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేవి. ఆ నిధుల ద్వారానే పంచాయతీలు మనుగడ సాగిస్తూవస్తున్నాయి. ప్రస్తుతం అవి కూడా లేకుండా పోయాయి.

ఇంటిపన్నులే దిక్కు..
14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే.. పంచాయతీలకు ఇంటిపన్నులే దిక్కు అవుతాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కంప్యూటర్‌ ఆపరేటర్లకు జీతాలు, తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాయి. తగినన్ని నిధులు లేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మేజర్‌ పంచాయతీలలో ఇంటిపన్నుల వసూళ్ల వలన కొంత నెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. మైనర్‌ పంచాయతీలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

మరిన్ని వార్తలు