సరికొత్తగా సచి‘ఆలయం’

3 Jul, 2019 10:26 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించగా.. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా పర్యవేక్షించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ సచివాలయం నడుస్తోంది. అక్కడ నుంచే సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన చేసేవారు. ఇక నుంచి పథకాల మంజూరుతో పాటు, పలు రకాల సేవలను సచివాలయాల నుంచే అందించేందుకు రూపకల్పన జరుగుతోంది. జిల్లాలో జనాభా ప్రతిపాదికన మొత్తం 681 సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2 వేల జనాభా దాటితే ఒక సచివాలయం.. 
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కనీసం రెండు వేల జనాభాకో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 980 పంచాయతీలుండగా.. 9,990 వార్డులున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 560 పంచాయతీల్లో 2 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలున్నాయి. వాటిని పరిశీలిస్తే.. 500 జనాభాలోపు పంచాయతీలు 33 ఉండగా.. 500 నుంచి 1000లోపు 140 ఉన్నాయి. అలాగే 1000 నుంచి 3000లలోపు 517 ఇందులో 75 శాతం 2 వేల కంటే జనాభా తక్కువ ఉన్న పంచాయతీలున్నాయి. 3000 నుంచి 5000లోపు 173, 5000 నుంచి 10,000లోపు 85, 10,000లకు పైగా 32 పంచాయతీలున్నాయి. పెనమలూరు మండలం కానూరు పంచాయతీలో అత్యధికంగా 49,600 జనాభా ఉండగా.. అత్యల్పంగా 134 మంది ఉన్న పంచాయతీగా ఉయ్యూరు మండలం జబర్లపూడి పంచాయతీ నిలిచింది.

జిల్లాలో పంచాయతీలు 980
మొత్తం జనాభా 
(2011 లెక్కల ప్రకారం)
26.73 లక్షలు
ప్రస్తుత జనాభా
(దాదాపుగా)
29.80  లక్షలు
గ్రామ వలంటీర్లకు దరఖాస్తులు 
(మంగళవారం సాయంత్రానికి)
33,616
ఏర్పాటు కానున్న 
గ్రామ సచివాలయాలు
681

15 శాతం అదనంగా కలిపి..
ఇది 2011లో తీసిన జనాభా లెక్కకావడంతో దీనికి అదనంగా 15 శాతం జనాభాను కలిపి లెక్కకడతారు. ఈ మేరకు రెండు వేల జనాభాపై ఉన్న పంచాయతీని ఒకే దాని కింద, అంత కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను రెండు లేదా మూడింటిని కలిపి ఒకే సచివాలయం కిందకు తీసుకురానున్నారు. ఇవి కేవలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు మాత్రమే ఉద్దేశించినవి. భౌగోళికంగా ఎటువంటి మార్పు ఉండదు.

వలంటీర్లకు దరఖాస్తుల వెల్లువ..
గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీరును ప్రభుత్వం నియమించబోతోంది. దీనికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి గత నెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రానికి 33,616 దరఖాస్తులు అందాయి.

పక్కాగా ఏర్పాట్లు.. 
గ్రామ సచివాలయాల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చేపడుతోంది. వాటిని భౌగోళికంగా ప్రతిపాదించడంతో పాటు, అందుకు అనుబంధంగా ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేసి ఇవ్వాలి. ఏయే పంచాయతీలు సచివాలయాల పరిధిలోకి వస్తున్నాయన్నది అందులో రంగుల్లో గుర్తించేలా మార్కు చేశారు. వాటి పూర్తి వివరాలను పంచాయత్‌ రాజ్‌ శాఖకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, పంచాయతీల విలీనంలో తప్పిదం జరిగినా భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కా సమాచారం సేకరిస్తున్నారు.

ఒకేచోట పది మంది ఉద్యోగులు..
గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. త్వరలోనే ఉద్యోగుల ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారికి శిక్షణ ఇచ్చి అక్టోబర్‌ రెండో తేదీ నాటికి వారు విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం, పశుసంవర్థక, రెవెన్యూ, వైద్యం, ఉద్యాన, అటవీ, సంక్షేమం, పంచాయతీరాజ్‌ వ్యవస్థలన్నీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పీడీఓ, మండల స్థాయి ఎంపీడీఓలు పర్యవేక్షించనున్నారు.  

మరిన్ని వార్తలు