నేటి నుంచి గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు

11 Jul, 2019 03:57 IST|Sakshi

మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మనుగా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీలు సభ్యులుగా నియామక బోర్డులు

రోజుకు 60 మంది అభ్యర్థులకు ఇంటర్వూ్యలు

పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు

మొత్తం పోస్టులు 1,81,885

వచ్చిన దరఖాస్తులు 7,92,334

సాక్షి, అమరావతి : గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం నుంచి ఇంటర్వూ్యలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్ల పోస్టుల కోసం జూన్‌ 24వ తేదీ నుంచి జూలై 5 వరకు 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంపీడీవో చైర్మనుగా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీలు సభ్యులుగా నియామక బోర్డులను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 800కు మించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి మండల ప్రత్యేకాధికారి చైర్మనుగా మరో ఇద్దరి అధికారులతో రెండో బోర్డు ఏర్పాటు చేశారు. మూడో బోర్డు అవసరమైన చోట పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు చైర్మనుగా మండలంలోని మరో ఇద్దరు అధికారులు నియామక సభ్యులుగా 
వ్యవహరించనున్నారు. 

గ్రామంలోని అభ్యర్థులందరికీ ఒకే రోజుఇంటర్వ్యూలు..: ఒక్కొక్క నియామక బోర్డు రోజుకు 60 మంది చొప్పున ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం మొదలయ్యే గురువారం రోజు మాత్రం ప్రతి బోర్డు కేవలం 30 మందికే ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రతి అభ్యర్థికి వంద మార్కులకు ఇంటర్వూ్య ఉంటుంది. బోర్డు చైర్మను 50 మార్కులకు, మిగిలిన ఇద్దరు సభ్యులు 25 చొప్పున 50 మార్కులు వేస్తారు. ఆయా గ్రామాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని వలంటీర్లుగా ఎంపిక చేస్తారు.

మండల యూనిట్‌గా తీసుకుని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. అలాగే ఒక గ్రామంలో వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే రోజున ఇంటర్వూ్య జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్వూ్యల సమయంలో మండలాల్లో తలెత్తే సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లాకొక ప్రత్యేకాధికారిని నియమించారు.

గ్రామ సచివాలయాల ఏర్పాటుపై సీఎస్‌ సమీక్ష..: గ్రామ సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖలు పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటుపై బుధవారం సచివాలయంలో సమన్వయశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ఆయా శాఖల మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నారు. సిబ్బందికి శిక్షణను అందించేందుకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలని సూచించారు.

పని భారం ఆధారంగా సిబ్బందికి విధులను కేటాయించడం కోసం శాశ్వతమైన ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఎంపికయ్యే గ్రామ సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్‌లోగా నియామక పత్రాలను అందజేయాలని, ఆ తర్వాత శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 2, 2019 నాటికి విధుల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో సీఎంవో ముఖ్య సలహాదారు అజయ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు