సేవా స్ఫూర్తి.. చైతన్య దీప్తి

8 Apr, 2020 13:25 IST|Sakshi
పెనుగొండలో ఇంటింటా సర్వే చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది

విపత్తు వేళ.. విధి నిర్వహణ భళా

కారుచీకట్లలో కాంతిరేఖల్లా.. ప్రభుత్వ ఉద్యోగుల సేవలు 

సాక్షి ప్రతినిధి, పశ్చిమ గోదావరి, ఏలూరు: కరోనా కరాళ నృత్యం చేస్తోంది.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయడంతో వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఇంతటి విపత్తు సమయంలోనూ వివిధ విభాగాల చిరుద్యోగులు చిత్తశుద్ధితో సేవలందిస్తూ కాంతి రేఖల్లా వెలుగులు నింపుతున్నారు. కరోనా నియంత్రణకు ఇతోధికంగా కృషిచేయడంతో పాటు వైరస్‌పై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఇప్పటికే సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని రోజూ సమీక్షించడంలో వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అధికారులు,ఎలక్ట్రికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులుసమాజ సేవలో పునీతులవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, నర్సింగ్‌ సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది విపత్తు వేళ విధులు నిర్వర్తిస్తూ సరిలేరు మీకెవ్వరూ అనిపించుకుంటున్నారు.   

సేవా  ‘వరం’టీర్‌
కరోనా మహమ్మారితో బయటకు రావడానికే భయపడుతున్న తరుణంలో గ్రామ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు చింతలపూడికి చెందిన ఎండీ సూరజ్‌ దౌలా. దౌలాది పేద కుటుంబం కావడంతో వలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ తన పరిధిలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నాడు. ఇంటింటా సర్వే చేస్తూ కరోనాపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాడు. కరోనాను నియంత్రించడంతో భాగస్వామి కావడం ఆనందంగా
ఉందని అంటున్నాడు దౌలా.  

కష్టమైనా    ఇష్టంగానే..!
తణుకు పట్టణానికి చెందిన ఈమె పేరు ఎం.శ్యామలాంబ. 17వ వార్డులో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తన వంతు కృషి చేస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా విధి నిర్వహణలో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఒకపక్క బయట తిరగవద్దు... ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కరోనా భయం వెంటాడుతున్నా కష్టంగానైనా ఇష్టంగానే బాధ్యత నెరవేర్చుతున్నానని అంటున్నారు. వార్డు వలంటీర్, ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి గర్భిణులు, చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు వారికి కావాల్సిన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు.  

తల్లిదండ్రుల బాధ్యత..   విధి నిర్వహణ  
ఇతని పేరు లింగాల మంగ నాగరాజు. ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. అవివాహితుడైన నాగరాజుపై తల్లిదండ్రుల బాధ్యత ఉంది. వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనా ఆయనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఇటువంటి తరుణంలో కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించగా అత్యవసర సేవ కావడంతో నాగరాజు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ పక్క తల్లిదండ్రుల బాధ్యతలను చూసుకుంటూ మరోపక్క నిరంతర విద్యుత్‌ సరఫరాకు సేవలందిస్తున్నారు. అత్యవసర సేవల్లో తాను భాగమైనందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉందని నాగరాజు అంటున్నారు. 

మరిన్ని వార్తలు