పల్లెతల్లి సేవకు తొలి అడుగు

2 Aug, 2019 08:48 IST|Sakshi

నేటి నుంచి 228 మంది మండల అధికారులకు శిక్షణ

మొత్తం 13,427 మంది వలంటీర్లకు నియామక పత్రాల అందజేత

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామాల్లో పారదర్శక పాలనకు మార్గం సుగమమైంది. సంక్షేమ పథకాలు ఇంటికే అందే విధంగా నూతన ప్రభుత్వం వినూ త్న విధానానికి రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనల్లో భాగంగా అమలు కానున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థలో తుది జాబితా విడుదల చేయడంతో పల్లె సేవకు తొలి అడుగు పడినట్టైంది. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ చొప్పున విధులు నిర్వర్తించనున్న ఈ నియామకాలకు సంబంధించి గత నెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ జరిగింది. ఈ మేరకు గురువారం అర్హుల తుది జాబితాను అధికారులు ఆయా మండలాల్లోనే విడుదల చేశారు.

అర్హులకు వలంటీర్లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు జిల్లాలోని 38 మండలాల్లో 1,141 గ్రామ పంచాయతీల్లో మొత్తం 13,427 మంది గ్రామ వలంటీర్లను నియమించారు. వీరంతా ఈ నెల 5 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు సన్నద్ధమవుతున్నారు. శిక్షణ అనంతరం ఈ నెల 15 నుంచి గ్రామాల్లో కేటాయించిన 50 ఇళ్లకు ఒక్కో వలంటీర్‌ చొప్పున విధుల్లోకి చేరనున్నారు.

నేటి నుంచి మండల అధికారులకు శిక్షణ
గ్రామ వలంటీర్ల నియామకాల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రత్యేక అధికార బృందం సిద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా నుంచి ఏడుగురు మాస్టర్‌ ట్రైనీలకు గత నెల 29,30 తేదీల్లో బాపట్లలో ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. అయితే ఇప్పటికే గుర్తించిన 228 మంది మండల స్థాయి అధికారులకు నేటి నుంచి రెండు రోజుల పాటు మాస్టర్‌ ట్రైనీస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మండలానికి ఆరుగురు చొప్పున పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికా రులను జిల్లా పరిషత్‌ సీఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో అధికార బృందం గుర్తించింది. దీంతో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పరిషత్‌ కొత్త సమావేశ మందిరం, పాత సమావేశమందిరంతో పాటు డీఆర్‌డీఏ సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.

ఒక్కో బ్యాచ్‌కు 57 మంది చొప్పున ఈ శిక్షణను ప్రారంభించనున్నారు. ఈ రెండు రోజుల శిక్షణ తర్వాత ఈ మండల స్థాయి అధికారులంతా కొత్తగా విధుల్లోకి రానున్న 13,427 మంది వలంటీర్లుకు ఆయా మండల కేంద్రాల్లోనే ఈనెల 5 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వలంటీర్ల విధులు, కనీస 50 ఇళ్లకు చేయాల్సిన సేవలు, ప్రభుత్వ పథకాల అందజేత విధానాలపై ఈ శిక్షణలో వివరించనున్నారు. అనంతరం ఈనెల 15 నుంచి వలంటీర్లంతా పూర్తి స్థాయి విధుల్లోకి వస్తారు.

పెరిగిన వలంటీర్ల పోస్టులు
వాస్తవానికి జిల్లాలో గ్రామ వలంటీర్లను 11,924 మందిని మాత్రమే నియమించేలా తొలుత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 
అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తొలుత పోస్టుల సంఖ్యను ఖరారు చేయడంతో తాజా పరిస్థితుల్లో జిల్లాలో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో వలంటీర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మొత్తం 13,427 మంది వలంటీర్లను నియమించేందుకు అధికారులు నిర్ణయించి, గురువారం విడుదల చేసిన తుది జాబితాలో ఉన్నవారికి నియామక పత్రాలు అందజేశారు. ఆయా మండలాల అధికారుల బృందమే సా మాజిక సేవనే ప్రాధాన్యతగా చేసుకుని అర్హులను గుర్తిం చింది. ఈ మేరకు గ్రామ వలంటీర్ల విధులు ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు.

రెండు రోజుల శిక్షణ ఇలా..
మండలానికి ఆరుగురు చొప్పున మొత్తం 228 మంది మండల స్థాయి అధికారులను జెడ్పీ సీఈఓ గుర్తించారు. ఈ మేరకు ఇటీవలే బాపట్లలో సుశిక్షితులైన మాస్టర్‌ ట్రైనీస్, శుక్ర, శని వారాల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా బ్యాచ్‌లను ఖరారు చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం కేటాయించిన సమావేశ మందిరాల్లో సంబంధిత మండలాల నుంచి ఎంపికైన మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

బ్యాచ్‌–1: జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో– ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి
బ్యాచ్‌–2 : జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో – సంతబొమ్మాళి, పోలాకి, వంగర, సారవకోట, పాతపట్నం,మెళియాపుట్టి,కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, వీరఘట్టం, భామిని.
బ్యాచ్‌–3: జెడ్పీ పాత సమావేశ మందిరంలో – జలుమూరు, బూర్జ, జి.సిగడాం, హిరమండలం, సరుబుజ్జిలి, రేగిడి ఆమదాలవలస, రాజాం, పాలకొండ, సంతకవిటి, సీతంపేట.
బ్యాచ్‌–4: డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో – శ్రీకాకుళం, ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్ల, గార, లావేరు, నరసన్నపేట, రణస్థలం.

శిక్షణకు సర్వం సిద్ధం
గ్రామ వలంటీర్ల నియామకాల్లో భాగంగా ముందుగా మాస్టర్‌ ట్రైనీలు, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొత్తం 228 మంది అధికారులను నాలుగు బ్యాచ్‌లుగా జెడ్పీ కొత్త సమావేశ మందిరంలో రెండు బ్యాచ్‌లు, పాత సమావేశ మందిరంలో మరో బ్యాచ్‌ను అలాగే డీఆర్‌డీఏ మీటింగ్‌ హాల్‌లో ఇంకో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే వలంటీర్లకు నియామక పత్రాలను కూడా అందజేశాం. 
– బి.చక్రధరరావు, జెడ్పీ సీఈఓ 

మరిన్ని వార్తలు