వేతన కష్టాలు  

20 Jan, 2019 07:04 IST|Sakshi
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

కర్నూలు(అర్బన్‌): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు అందడం లేదు. దాదాపు రెండున్నర నెలలుగా వేతనాలు ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం ఆరు గంటలకే పనులకు వెళుతూ.. చెమటోడ్చి కష్టిస్తున్నారు. అయినప్పటికీ కనీసం వారానికి ఒక సారి కూడా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు సరిగా అందకపోవడంతో చాలా ప్రాంతాల్లోని కూలీలు ఉపాధి పనులకు స్వస్తి పలికి, సుదూర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు.

ఇప్పటికే పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఉన్న వారు కూడా తమ ప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ కూలి ఇచ్చే పనులకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్‌గా వేతనాలు విడుదల కాకపోవడంతో కూలీలతో పనులు చేయించేందుకు  ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా మక్కువ చూపడం లేదని తెలుస్తోంది. చేసిన పనులకు వేతనాలు ఇవ్వాలని కూలీలు మండల పరిషత్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. సంబంధిత అధికారులు ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.

రూ.50 కోట్ల పెండింగ్‌  
జిల్లాలో ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల మేర వేతనాలను చెల్లించాల్సి ఉంది. గత ఏడాది నవంబర్‌ ఏడో తేదీ నుంచి బకాయిలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో విడుదలైన రూ.39 కోట్ల నిధులతో అక్టోబర్‌ వరకు సర్దుబాటు చేశారు. తర్వాత నిధులు విడుదల కాలేదు. వేతనాలు అందకపోవడంతో కూలీల హాజరు క్రమేణా తగ్గిపోతోంది. గతంలో 60 వేల దాకా ఉన్న కూలీల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది.
 
వారానికి ఒకసారైనా ఇవ్వకపోతే ఎలా? 

చేసిన పనులకు కనీసం వారానికి ఒకసారైనా కూలి ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఇప్పటికే రెండున్నర నెలలుగా వేతనాలు అందించకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. గ్రామాల్లో ఇతర పనులకు వెళ్లే వారిని ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారు. అయితే..వేతనం మాత్రం నెలల తరబడి ఇవ్వడం లేదు. – ఆంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం 

నెలాఖరుకు విడుదల కానున్నాయి ఉపాధి కూలీలకు రూ.50 కోట్ల వరకు వేతన బకాయిలున్న మాట వాస్తవమే. నవంబర్‌ ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు వేతనాలను అందించాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పెండింగ్‌ ఉన్నాయి. బకాయి పడిన వేతనాలను విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెలాఖరు నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.   – ఎం.వెంకటసుబ్బయ్య, డ్వామా పీడీ

మరిన్ని వార్తలు