వైభవంగా ధ్వజారోహణం

14 Feb, 2014 02:41 IST|Sakshi

కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని శ్రీవిజయదుర్గాదేవి ఆలయ ద్వాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి మూలమూర్తికి వేదయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకారం చేశారు.

 వేదపండితులు రాయపెద్ది సుబ్బరాయశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఫణిభూషణశర్మల బృందం ఆలయ  వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్‌రావు, తమ కుటుంబ సభ్యులు, భక్తులతో కలిసి మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం వాస్తుపూజ నిర్వహించారు.

ఉదయం 11గంటలకు ధ్వజస్థంభం వద్ద పూజలు నిర్వహించి సింహం చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు. ఈ సందర్భంగా ధ్వజపూజలో వినియోగించిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు కొడిముద్దలుగా అందజేశారు. అనంతరం యాగశాలలో చండీహోమం, నవావరణ శ్రీచక్రార్చన నిర్వహించారు. రాత్రి అమ్మవారిని సింహవాహనంపై అలంకరించి ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
 

>
మరిన్ని వార్తలు