బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు

10 Oct, 2013 03:03 IST|Sakshi

బెల్లంపల్లి, న్యూస్‌లైన్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పద్మశాలి భవన్‌ నుంచి బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని వేలాది మంది మహిళలతో కవిత ర్యాలీగా తిలక్‌ స్టేడియంకు చేరుకున్నారు. డోలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, బతుకమ్మ పాటలు, చిన్నారుల కోలాటం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పద్మశాలి భవన్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన కాంటా చౌరస్తా, బజార్‌ఏరియా, పాతబస్టాండ్‌ మీదుగా తిలక్‌ స్టేడియంకు చేరుకుంది. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో నిర్వహించిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి. తిలక్‌స్టేడియంలో కవిత ఆడపడుచులతో ఉత్సాహంగా కోలాటం ఆడిపాడారు. స్టేజీ మీద పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద సతీమణి సరోజ, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలకీష్మ, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

బతుకమ్మ పేర్చిన కవిత
బంగారు బతుకమ్మను పురస్కరించుకొని కవిత పలువురి ఇళ్లలో బతుకమ్మలను పేర్చారు. పట్టణంలోని స్టేషన్‌రోడ్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ప్రవీణ్‌, రైల్వే రడగంబాలబస్తీలోని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్‌, రాంమందిర్‌ఏరియాలో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎం.సత్తిబాబు ఇండ్లకు వెళ్లి పెద్దపల్లి ఎంపీ వివేకానంద సతీమణి సరోజతో కలిసి కవిత బతుకమ్మలు పేర్చారు. అంతకుముందు కవిత కన్నాల శివారులోని శ్రీ బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

తొలిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద, రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.వినోద్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలకీష్మ, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు కె.మల్లయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎస్‌.నర్సింగం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్‌ , నాయకులు బి.రమేశ్‌, జి.చంద్రశేఖర్‌, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో ‘తెలంగాణ’ సాకారం
మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాబోతుందని, ఏదేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడితే టీజేఏసీ, టీఆర్‌ఎస్‌ ఇచ్చే పిలుపు మేరకు ఉద్యమంలో మహిళలు ముందుండాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తిలక్‌ స్టేడియంలో బతుకమ్మ ఆడిన అనంతరం ఆమె మాట్లాడారు. సీమాంధ్ర ప్రభుత్వం జనావాసాల మధ్య ఓపెన్‌కాస్‌‌టలను ఏర్పాటు చేసి ప్రజలను నిర్వాసితులను చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జనావాసాలకు దూరంగా బొగ్గు గనులను ఏర్పాటు చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలన్నారు. కొత్త గనుల ఏర్పాటుతో నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణి యాజమాన్యమే మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు అందులో ప్రత్యేక కోటా కల్పించాలన్నారు. సీఎం వైఖరితోనే ఏపీఎన్‌జీవోలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమం డ్రామా అని కొట్టిపడేశారు.

సీమాంధ్ర సీఎంను తొలగించాలి..
మంచిర్యాల టౌన్‌ : మొదటి నుంచి కిరణ్‌ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్న వాస్తవాలు డీజీపీ వ్యాఖ్యలతో తేలిపోయాయని కవిత అన్నారు.బుధవారం మంచిర్యాలలోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో బతుకమ్మ, కోలాటం ఆడిపడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మంచిర్యాలలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడంతో ముందుంటారని, ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న బంగారు బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ వేడుకలు హైదరాబాద్‌ మాది అని సీమాంధ్రులకు బతుకమ్మ సంబరాలతో తెలియజేస్తామన్నారు. అయితే సీఎంకు సహకరించిన డీజీపీ కూడా అవినీతిపరుడేనని అన్నారు.

కేంద్రం రాష్టప్రతి పాలన విధించడమా లేదా సీమాంధ్ర సీఎంను తొలగించడమా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కవిత వెంట ఎమ్మెల్యే సతీమణి హేమానళిని అరవిందరెడ్డి, జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, మండల కన్వీనర్‌ పుష్ప, పట్టణ కన్వీనర్‌ తిరుమల, టీఆర్‌ఎస్‌ మహిళా జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, స్నేహ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు భాగ్యలకిష్మ, ప్రధాన కార్యదర్శి చందన, సభ్యులు మణిమాల, సంగీత, మహిళలు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు