జగన్నాథునికి జేజేలు

19 Jan, 2014 05:00 IST|Sakshi

నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ :  సృష్టి, స్థితి, లయకారుల్లో ఒకరైన శ్రీమన్నారాయణుడు రథంలో కొలువుదీరి చల్లని చూపులతో భక్తజన సందోహాన్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. రంగవల్లులు, మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, యువకుల విన్యాసాలు, భక్తుల హరేరామ, హరేకృష్ణ నామస్మరణల నడుమ అంగరంగవైభవంగా జగన్నాథుడు పురవిహారం చేశారు. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో జగన్నాథుని రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. తల్పగిరి రంగనాథస్వామి దేవస్ధానం వద్ద విశేష పుష్పాలు, రంగు కాగితాలతో రథాన్ని శోభాయమానంగా అలంకరించారు. బలరామకృష్ణులు, సుభద్రాదేవి విగ్రహాలను రథంలో కొలువుదీర్చారు. ఇస్కాన్ అర్చక బృందాల ఆధ్వర్యంలో జగన్నాథునికి 51 రకాల నైవేద్యాలను సమర్పించారు.
 
 హరేరామ..హరేకృష్ణ అంటూ భక్తులు భగవన్నామస్మరణ చేస్తుండగా, ఇస్కాన్ బృందం శంఖాలను పూరిస్తుండగా రథచక్రాలు కదిలాయి. ఒంటెలు, గుర్రాలు విన్యాసాలు, మహిళల ముగ్థమనోహర కోలాట ప్రదర్శనలు, అబ్బురపరిచే చిన్నారుల జడకోలాటాలు, నృత్యప్రదర్శనలు రథం ముందు సాగాయి. దారి పొడవునా రంగవల్లులు తీర్చిదిద్ది, హారతులు సమర్పిస్తూ..మహిళలు జగన్నాథునికి స్వాగతం పలికారు. ఇస్కాన్ బృంద యువత భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు పోటీపడ్డారు. రంగనాయకులపేట నుంచి ప్రారంభమైన యాత్ర సంతపేట, ఏసీ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, వీఆర్సీ, ఆర్టీసీ మీదుగా కస్తూరిదేవి గార్డెన్స్‌కు చేరుకుంది.  
 
 విశేష పూజలు
 కస్తూరిదేవి గార్డెన్స్‌లో జగన్నాథుని రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి కుంభహారతులు, 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జగన్నాథున్ని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. విద్యుత్ దీపకాంతుల్లో కస్తూరిదేవి స్కూలు ప్రాంగణం వెల్లివిరిసింది. కేరళ సంప్రదాయ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
 ప్రత్యేక ఆకర్షణగా రథం
 జగన్నాథుని పురవిహారానికి ఉపయోగించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో రథం వెళ్లే మార్గంలో చెట్ల కొమ్మలు, కరెంట్ తీగలను తొలగించాల్సి వచ్చేది. ఈ దఫా మాత్రం రథం ఎక్కడికక్కడ తలదించుతూ, ఎత్తుతూ ప్రత్యేకాకర్షణగా మారింది. విద్యుత్ తీగ వస్తే వెంటనే కిందకు వంగేలా, తర్వాత యథాస్థానానికి చేరుకునేలా రథం రూపొందించారు. రథయాత్రలో ఇస్కాన్ సౌత్ ఇండియా జీబీసీ భానుమహరాజ్ ప్రభు, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఇస్కాన్ ప్రతినిధులతో పాటు నెల్లూరు అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌స్వామి, వైఎస్సార్‌సీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, హాజీ అబ్దుల్ అజీజ్, ఇస్కాన్ తిరుపతి, రాజమండ్రి, హైదరాబాద్, హోసూరు, మధురై, విజయవాడ అధ్యక్షులు రేవతీ రమణదాస్, సత్యగోపీనాథ్ దాస్, వేదాంత చైతన్యదాస్, శ్రీనివాస శ్యాం దాస్, రూపేస్వర చైతన్య దాస్, రామ్‌మురారీ దాస్, జేసీ లక్ష్మీకాంతం సతీమణి శోభాలత, దేవరాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ యాత్ర విశేషాలు తెలిపే జయజగన్నాథ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
 
 ఇస్కాన్‌కు వేమిరెడ్డి దాతృత్వం
 నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇస్కాన్ మందిరానికి రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. జగన్నాథ రథయాత్రలో ప్రసాదాల పంపిణీ కోసం ఈ మొత్తాన్ని ఇస్కాన్ అధ్యక్షులు సుఖ్‌దేవ్‌స్వామి స్వీకరించారు. వేమిరెడ్డి మాట్లాడుతూ వైదిక సంప్రదాయంలో ప్రాచుర్యం పొందిన జగన్నాథ రథయాత్ర నగరంలో జరగడం ఎంతో అదృష్టమన్నారు. అనంతరం ఇస్కాన్ ప్రతినిధులకు టీ షర్టులను విడుదల చేశారు. వేమిరెడ్డిని జ్ఞాపికతో ఇస్కాన్ జపాన్ ప్రతినిధి భానుస్వామి మహరాజ్ సత్కరించారు.
 

మరిన్ని వార్తలు