భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

29 Aug, 2013 02:36 IST|Sakshi
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ మందిరం) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఇస్కాన్ ప్రాంగణమంతా జనసంద్రమైంది. హరే కృష్ణ నామస్మరణతో ఆప్రాంతం మార్మోగింది. వేకువజామునే శ్రీకృష్ణునికి మహామంగళహారతితో మేలుకొలుపు పాడారు. అనంతరం శృంగారహారతితో గోపాలుని కొలిచారు. ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్‌దాస్ భాగవత ప్రవచనంలో ధర్మసంస్థాపన కోసమే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భువిపై అవతరించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వశాంతి మహాయజ్ఞాన్ని వేద విద్వాంసులు ఘనంగా నిర్వహించారు.
 
 ఇస్కాన్ సేవలు అభినందనీయం : రౌతు
 ఆధ్యాత్మిక, సేవారంగాల్లో ఇస్కాన్ సేవలు అభినందనీయమని నగర శాసన సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ఇస్కాన్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బుధవారం మధ్యాహ్నం ఆయన బహుమతి ప్రదానం చేశారు. వివిధ విద్యాసంస్థల నుంచి 2850 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
 
  సంప్రదాయ నాట్యం, చిత్ర
 లేఖనం, వక్తృత్వం, గాత్రం, విచిత్ర వేషధారణ, వ్యాసరచన, భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ పోటీల్లో హోలీ ఏంజిల్స్ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి మోటూరి యాశ్విత్ తృతీయ బహుమతిని గెలుచుకున్నాడు. కృష్ణార్జునులుగా ద్విపాత్రాభినయం చేసి అందరినీ అలరించాడు.
 
 ఉత్సాహంగా సాగిన ఉట్టికొట్టడం
 వెన్నమీగడలు దొంగిలించిన బాలకృష్ణుని లీలలను స్ఫురింపచేసే ఉట్టికొట్టడం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువకులు పాల్గొన్నారు. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. బాలయ్య ఉట్టికొట్టడంలో విజయం సాధించాడు. రాధాకృష్ణుల చిత్రపటాన్ని, ప్రసాదాన్ని బహుమతిగా ఇస్కాన్ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ చేతుల మీదుగా అందుకున్నాడు.
 
 శేషవాహనంపై రాధాకృష్ణుల ఊరేగింపు
 అనంతరం అనంత శేషవాహనంపై రాధాకృష్ణులను ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా లవకుశ పౌరాణిక నాటకాన్ని హైదరాబాద్‌కు చెందిన సురభి కళాకారులు ప్రదర్శించారు. రాధాకృష్ణులను విద్యుద్దీపాలతో అలంకరించిన పడవలో ఉంచి గోదావరిలో తెప్పోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని
 నిర్వాహకులు తెలిపారు.
 
 రత్నగిరిపై...
 అన్నవరం:  రత్నగిరిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు మహారాజ గోపురం ఎదురుగా గల ఆవరణలో దేవస్థానం చైర్మన్ రామ్‌కుమార్, ఏసీ ఈరంకి వేంకట జగన్నాథరావు తదితరులు గోవులను పూజించారు. వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గంగాధరభట్ల గంగాధరశాస్త్రి,  చిట్టి శివ, ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవుని  ప్రధానాలయంలో శ్రీకృష్ణుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. వెన్న, నేతితో చేసిన పిండివంటలను, పాలు, పండ్లను శ్రీకృష్ణునికి నివేదన చేశారు. రాత్రికి సత్యదేవుడు, అమ్మవారు, శ్రీకృష్ణులను గ్రామంలో ఊరేగించారు. రత్నగిరి రామాలయం, తొలిపాంచా, పంపా సత్రం, ఈరంకి వారి వీధి తదితర చోట్ల ఉట్ల పండుగను నిర్వహించారు. రత్నగిరిపైగల శ్రీగోకులంలో సప్తగోవులకు అధికసంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు చేసి శ్రీకృష్ణుని పూజించారు.
 
మరిన్ని వార్తలు