చిన్న వయసు.. పెద్ద మనసు

22 May, 2018 10:58 IST|Sakshi
తాతయ్యకు సేవ చేస్తున్న మనవరాలు రెడ్డిఈశ్వరి

తాతయ్య రుణం తీర్చుకోవాలని ఓ విద్యార్థిని తపన

పక్షవాతం సోకడంతో ఆస్పత్రిలో సేవ చేస్తున్న మనవరాలు

ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు భారం అనుకుంటున్న వారూ చాలా మంది ఉన్నారు... తమను పెంచి పోషించిన వారు మంచాన పడితే పట్టించుకోని వారినీ చూస్తుంటాం.. వారికి ఆలనాపాలన చూ సేందుకు వెనకాడుతుంటారు... అయితే ఓ అమ్మాయి తమ తాతయ్య కోసం అహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తోంది.

రాయచోటి రూరల్‌ : రాయచోటి మండలం వరిగపాపిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలోని చౌడచెరువువారిపల్లెకు చెందిన శంకారపు రెడ్డి ఈశ్వరి ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసింది. తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తాతయ్య శంకారపు గంగాధరానికి సేవలందిస్తోంది. శంకారపు గంగాధరం(90) ఉపాధ్యాయుడిగా, ఎంఈవోగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. ఎంఈవోగా లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో పని చేస్తూ రాయచోటి పట్టణంలో నివాసం ఉండేవారు. పెద్ద కుమారుడు వెంకటరమణ బిడ్డలు రెడ్డికుమారి, రెడ్డి ఈశ్వరి, రెడ్డిప్రసాద్‌తోపాటు రెండో కుమారుడు శివప్రసాద్‌ బిడ్డలను కూడా తన వద్దనే ఉంచుకుని చదివించాడు. విద్య విలువ తెలియడంతో పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశంతో వారినే తన వద్దే ఉంచుకున్నారు. వారి చిన్ననాటి నుంచి ఆలనాపాలన చూసుకున్నారు.

పక్షవాతం సోకడంతో..
గంగాధరానికి వయసు మీద పడింది. ప్రస్తుతం 90 ఏళ్లు. ఆయనకు పక్షవాతం సోకడంతో మొదట తిరుపతి, అనంతరం మహల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరి రాత్రి, పగలు ఆయన దగ్గరే ఉంటూ సేవలందిస్తోంది. రోజుకు మూడు పూటలా వేడినీరు, తడిబట్టతో శరీరం శుభ్రం చేయడంతోపాటు అన్ని రకాల సపర్యలు చేస్తోంది. ఇది చూస్తున్న ఆసుపత్రి వర్గాలు, ఇతర రోగులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బిడ్డ పుడితే సంతోషించని వారు ఎవరు ఉంటారని వారు అంటున్నారు.

రుణం తీర్చుకుంటున్నా
కుటుంబంలో అందరి మంచి కోరుకుంటూ.. మనవళ్లు, మనవరాళ్లను బాగా చదివించిన గొప్ప మనిషి మా తాతయ్య. ఇప్పుడు ఆయనకు జబ్బు చేసింది. సేవ చేసి, రుణం తీర్చుకోవాలని ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నాను. అమ్మానాన్నలు, చినాన్న వాళ్లు, అవ్వ అందరూ తరచూ వచ్చి తాతయ్యను బాగా చూసుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా చూసుకోవాలనుకుంటున్నాను.     – రెడ్డి ఈశ్వరి

మరిన్ని వార్తలు