సింధు, గోపీచంద్కు రేపు ఏపీ ప్రభుత్వం సన్మానం

22 Aug, 2016 17:49 IST|Sakshi
సింధు, గోపీచంద్కు రేపు ఏపీ ప్రభుత్వం సన్మానం

విజయవాడ:  రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలుచుకున్న పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఈ కార్యక్రమం చేపట్టనుంది. రేపు ఉదయం  సింధు, కోచ్ గోపీచంద్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా సింధు, గోపీచంద్‌ను సత్కరించనున్నారు.

పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగే సత్కార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. మంగళవారం కృష్ణాపుష్కరాల ముగింపు కూడా కావడంతో సంగమం వద్ద కొద్దిపాటి మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు పుష్కరాల ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను. సీపీ గౌతంసవాంగ్, మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, జేసీ గంధం చంద్రుడు సోమవారం మధ్యాహ్నం పవిత్రసంగమం ఘాట్‌ను పరిశీలించారు. ముగింపు వేడుకలకు ఏయే మార్పులు చేయాలో బోయపాటి శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి బి రాజశేఖర్ మాట్లాడుతూ నిత్యహారతికి ముందు సింధుకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

ప్రస్తుతం హారతి కోసం ఏర్పాటు చేసిన ఫంట్‌ను కొద్దిగా నదిలోకి వెనక్కు జరుపుతున్నట్లు తెలిపారు. ఘాట్ వద్ద కొద్దిపాటి మార్పులు తప్ప పెద్దగా ఏమీ మార్పులు చేయబోమన్నారు. ఘాట్ వద్ద వెయ్యి మంది కూచిపూడి కళాకారులు నృత్య ప్రదర్శన ఇస్తారన్నారు. హారతి, పుష్కరాల ముగింపు వేడుకలు చూసేందుకు తరలివచ్చే వీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తరలివచ్చే భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్‌సీడీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మీడియాకు వేడుకల ముగింపు సందర్భంగా ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. నదిలో హారతి వెనుకభాగంలో బాణా సంచా కాల్చేందుకు వీలుగా బోయపాటి శ్రీను ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా చేపట్టే ఈవెంట్ చరిత్రలో మిగిలిపోయేలా చేస్తున్నామన్నారు. భద్రత పరంగా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ గౌతంసవాంగ్ చెప్పారు.

కాగా సింధుకు ఏపీ సర్కార్ రూ.3కోట్ల నగదు, అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా