ఊరూరా అన్నదాతల వేడుక

9 Jul, 2020 05:07 IST|Sakshi
విజయవాడ రూరల్‌ కుందావారి కండ్రికలో రైతు భరోసా కేంద్రం వద్ద వరి నారు, వైఎస్సార్‌ చిత్రపటంతో రైతన్నల ఆనందం

10,641 రైతు భరోసా కేంద్రాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు

కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాలతో ఎంతో మేలంటున్న రైతులు

వ్యవసాయ యాంత్రీకరణపై ప్రతిచోటా అవగాహన సదస్సులు

3 వర్సిటీలలో రైతు దినోత్సవాలు

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరూరా పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యేకించి అన్నదాతలు రైతు శ్రేయోభిలాషి డాక్టర్‌ వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. సాగు రంగానికి ఆ మహానేత చేసిన సేవలను స్మరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 10,641 డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో రోజంతా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆర్బీకేలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం రెండు విడతలుగా ఆర్బీకేలలో కార్యక్రమాలు జరిగాయి. మరోపక్క వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సిటీలలోనూ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలో డాక్టర్‌ వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆర్బీకేలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 
► ప్రతి ఆర్బీకేలో 50 మంది రైతులు భౌతిక దూరాన్ని పాటిస్తూ వైఎస్సార్‌కు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్బీకేలోని టెలివిజన్‌లో ప్రార్థనా గీతాన్ని వినిపించారు. 
► జగన్‌ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు సంక్షేమానికి, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, చూపిన చొరవ, రైతులకు ఇచ్చిన ప్రోత్సాహాలతో కూడిన ప్రకటనను గ్రామీణ వ్యవసాయ సహాయకులు కొన్ని చోట్ల, ఉద్యాన సహాయకులు చోట్ల చదివి వినిపించారు. 
► పలుచోట్ల ఆదర్శ రైతులను సన్మానించారు. రాజశేఖరరెడ్డితో తమకున్న అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. 

కియోస్క్‌లలో పేర్ల నమోదు
► కియోస్క్‌లలో నమోదు కాని రైతుల పేర్ల నమోదు జరిగింది. కియోస్క్‌ల ద్వారా రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ ఉత్పాదకాలను ఎలా ఆర్డర్‌ చేయవచ్చో అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై కూడా అక్కడక్కడా చర్చ జరిగింది.
► ఈ నెల పది నుంచి ప్రారంభమయ్యే ఇ–పంట నమోదుపై స్థానిక అధికారులు మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను, వ్యవసాయ, పశు సంవర్థక రంగాలలోని రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (కేసీసీ) పంపిణీ చేశారు.
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన 9 రకాల పోస్టర్లను ఆర్బీకేలలో ప్రదర్శించారు. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస ప్రదర్శనలు జరిగాయి. 
► మత్స్యశాఖ ఆక్వా బడి, ఉద్యాన శాఖ డాక్టర్‌ వైఎస్సార్‌ తోట బడి వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. 
► వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లలో ఏయే పని ముట్లను ఉంచుతారో, వాటిని రైతులకు ఎలా అద్దెకు ఇస్తారో గ్రామ వ్యవసాయ సహాయకులు వివరించారు. తక్కువ ధరకు పని ముట్లు అద్దెకు దొరకడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో..
► ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ వర్సిటీలో రిజిస్ట్రార్‌ సుధాకర్‌ తదితరులు డాక్టర్‌ వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడన్నారు. అపర భగీరథుడని కొనియాడారు.
► వైఎస్‌ జగన్‌ రైతు సంక్షేమానికి చేపడుతున్న చర్యలను వక్తలు కొనియాడారు.
► ఉద్యాన వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకీరామ్‌ తదితరులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ యూనివర్సిటీకి డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు పెట్టినందుకు గర్విస్తున్నామన్నారు. 
► కోవిడ్‌–19 కారణంగా రైతు దినోత్సవాన్ని జూమ్‌ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని 20 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
► శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలోనూ రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. వర్సిటీ అధికారులు డాక్టర్‌ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించి తమ యూనివర్సిటీ పురోభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారని శ్రద్ధాంజలి ఘటించారు.  

మరిన్ని వార్తలు