అపూర్వ ఘట్టం..అభిమాన ఝరి

23 Jun, 2019 08:52 IST|Sakshi

సింహపురి గడ్డపై అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రకృతి మురిసింది. జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా శనివారం ఈ గడ్డపై అడుగు పెట్టిన క్షణంలో వరుణుడు తొలికరి జల్లులతో ఘన స్వాగతం పలికాడు. నిన్నటి వరకు భగభగమంటూ మండిన సూర్యుడు.. ఒక్కసారిగా చల్లని వాతావరణంతో పాటు చిరు జల్లులు కురిపించి మా దీవెనలుఉంటాయని వరుణుడు ఆశీర్వదించాడు. 

సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ సీపీకి కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పది స్థానాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇచ్చిన జిల్లా. అటువంటి జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరు యువకులకు కీలకమైన మంత్రి పదవులను కేటాయించారు. మంత్రి పదవులు చేపట్టిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి పి అనిల్‌కుమార్‌యాదవ్‌ మొదటి సారిగా శనివారం నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఇద్దరు మంత్రులకు  ఘనమైన అపూర్వ స్వాగతాన్ని పలికారు.  నగరంలో అటు చివర కిసాన్‌ నగర్‌ నుంచి మద్రాసు బస్టాండు వరకు ఎటు చూసినా జనసంద్రంగా మారింది. 

అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు
నెల్లూరుకు చేరుకున్న ఇద్దరు మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి అనిల్‌కుమార్‌కు అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు. ప్రతి చోట సన్మానాలు, పూల వర్షంతో స్వాగతాలు పలికారు. మొదటగా నగరంలోని కిసాన్‌నగర్‌ ప్రాంతం నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభించారు. మైపాడు గేటు సెంటర్‌లో క్రేన్‌ సహాయంలో ఇద్దరు మంత్రులకు  గజమాలను అలంకరించారు. అక్కడి నుంచి నవాబుపేట, స్టౌన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్‌ వరకు పూల వర్షంతో ర్యాలీ సాగింది. ప్రతి చోట గజమాలలు, శాలువాలతో మంత్రులను సత్కరించారు. గాంధీబొమ్మ ప్రాంతంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కాగడాల ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడే గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అనంతరం  వీఆర్సీ నుంచి మద్రాసు బస్టాండ్‌ వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి చోట పూల వర్షంతో  స్వాగతాలు పలికారు. నగరంలో బైక్‌ ర్యాలీతో మొదలై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం గమనార్హం. 

ముగ్గురు మహానుభావులకు నివాళులు
మొదటి సారిగా నెల్లూరుకు వచ్చిన ఇద్దరు మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి అనిల్‌కుమార్‌ ర్యాలీ గాంధీబొమ్మ సెంటరుకు చేరుకుంది. అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్సీ సెంటలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  మొత్తం ర్యాలీని కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌ పర్యవేక్షించారు.

మేకపాటిని కలిసిన ఇద్దరు మంత్రులు
ఇద్దరు మంత్రులు పి అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిలకు చేపట్టిన స్వాగత ర్యాలీ మద్రాసు బస్టాండ్‌ వద్ద ముగిసింది. అక్కడి నుంచి నేరుగా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు మంత్రులు రాజమోహన్‌రెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

భారీ బందోబస్తు
నగరానికి మొదటి సారిగా ఇద్దరు మంత్రులు రాక సందర్భంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బందో బస్తును ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి నుంచి సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది బందోబస్తులో పాల్గొని ర్యాలీకి కాని, ప్రజలకు కాని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. ట్రాఫిక్‌ ఆగిన చోట కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్‌ ఫ్టోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ రామిరెడ్డి, సన్నపురెడ్డి పెంచల్‌రెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, ఓబిలి రవిచంద్ర, ఎండీ ఖలీల్‌ అహ్మద్, హంజాహుస్సేని, నూనె మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు