గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘనస్వాగతం

12 Sep, 2019 23:24 IST|Sakshi

సాక్షి, కృష్ణా : బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు గురువారం గన్నవరం  ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన అనంతరం తొలిసారిగా సింధు విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యాటక, యువజన శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ భాస్కర్‌లు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సింధుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘ప్రపంచ విజేతగా పతకం సాధించడం అదృష్టంగా భావిస్తున్నాను. నాలుగు సార్లు చాంపియన్‌ షిప్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో చాంపియన్‌షిప్‌ సాధించాను. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గారు ఫోన్‌ చేసి నన్ను అభినందించారు. జగన్‌ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే విజయవాడ వచ్చాను. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంద’ని అన్నారు

విజయవాడ చేరిన సింధు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరించందన్‌ను సింధు కలుస్తారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్‌ సింధుకు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు