జిల్లాలో ఘనంగా విజయ దశమి వేడుకలు

14 Oct, 2013 00:25 IST|Sakshi
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. సకల విజయ వరప్రదాయిని దుర్గా మాతకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. దసరా పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపారు. వృత్తి, వ్యాపారాల రీత్యా దూర ప్రాంతాల్లో నివాస ముంటున్న ప్రజలు పిల్లాపాపలతో కలిసి సొంతఊళ్లకు తరలివచ్చి పండగ జరుపుకున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు సొంత నియోజకవర్గ ప్రజల మధ్య దసరా ఉత్సవాలు నిర్వహించుకోగా..మరికొందరు ఎప్పటిలాగే ప్రజలకు ‘దూరం’గా ఉండిపోయారు. అందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గీతారెడ్డిలు పండగ పూట హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. మంత్రులకు శుభకాంక్షలు తెలిపేందుకు ముఖ్య అనుచరులు హైదరాబాద్‌కు వెళ్లారు.
 
 సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలంగాణ సంఘాల ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే దుబాయ్‌కు వెళ్లడంతో ఆయన స్థానికంగా పండగను జరుపుకోలేకపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వచ్చాకా సోమవారం సిద్దిపేటకు చేరుకుని స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎప్పటిలాగే  తొమ్మిదురోజుల దీక్ష చేపట్టి ఈ ఏడాదీ కూడా తన మాతృమూర్తి ఊరు జన్నపల్లి (నిజామబాద్ జిల్లా) దసరా వేడుకలను జరపుకున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఇక మెదక్ ఎంపీ విజయశాంతి సైతం హైదరాబాద్‌లోని తన నివాసానికి పరిమితమయ్యారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి శివ్వంపేట మండలంగొమారంలోని అత్తారింట్లో పండుగ జరుకున్నారు. 
 
 జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తన సోదరుడితో కలిసి నారాయణ్‌ఖేడ్‌లోని నివాసంలో వేడుకలు నిర్వహించుకున్నారు. స్థానిక సర్పంచ్ అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో జరిగిన రావణాసురుడి దహన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.  నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి పట్టణంలోని మంగల్‌పేటలోని తన నివాసంలో పండగ జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి ఊరి శివారులో ఉన్న జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో వేడుకలు జరుపుకున్నారు.
 
 పటాన్‌చెరు మైత్రి మైదానంలో మహంకాళి సేవాసమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జరిగిన రావణ దహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వపాన్‌దేవ్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి  గూడెం మహిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి రాంచంద్రాపురంలోని అతిథి గృహం వద్ద ఉన్న జమ్మిచెట్టు వద్ద లెసైన్స్‌డ్ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి సంబరాలను ప్రారంభించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అనవాయితీ ప్రకారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో వేలాది మంది ప్రజల మధ్య దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారీ వ్యయంతో ఏర్పాట్లు చేసి మరోసారి తన ప్రత్యేకతను జగ్గారెడ్డి నిలబెట్టుకున్నారు. 
 
మరిన్ని వార్తలు