అమ్మమ్మ కూడా కన్నుమూసింది

25 Jun, 2020 07:54 IST|Sakshi
మృతిచెందిన గోవిందమ్మ

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న గుళికల మందు కలిసిన కోడికూర

రెండు మండలాల్లో విషాదం

గుడిపాల: మసాలా పొడి అనుకుని గుళికల మందు వేసి వండిన చికెన్‌ను తిన్న మహిళ సైతం బుధవారం కన్నుమూసింది. అమ్మమ్మ వండిన చికెన్‌ను తిన్న ఇద్దరు మనవళ్లు సోమవారం తిని మరణించడం విదితమే. ఆ చికెన్‌ను వండిన గోవిందమ్మ (52) పరిస్థితి కూడా విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. వివరాలు..తవణంపల్లె మండలం ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన రాంబాబు కుమారులు ఈనెల 13న గుడిపాల మండలంలోని అమ్మమ్మ గోవిందమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం అమ్మమ్మను చికెన్‌ చేసి పెట్టమని అడిగారు.

అయితే గోవిందమ్మకు మతిస్థిమితం సరిగా లేదు. గోవిందమ్మ కోడికూర చేస్తూ మసాలాపొడి అనుకుని గుళికల మందును అందులో వేసింది. వండిన తర్వాత చికెన్‌ను తిన్న ఆమె మనుమళ్లు రోహిత్, జీవ మృతిచెందడం విదితమే. గోవిందమ్మ పరిస్థితి విషమంగా  ఉండడంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూసినట్లు గుడిపాల ఎస్‌ఐ వాసంతి తెలిపారు. ఒక రోజు వ్యవధిలో మనవళ్లు, అమ్మమ్మ మరణించడంతో రెండు మండలాల్లోనూ తీవ్రవిషాదం నింపింది.(మసాలా పొడి అనుకుని చికెన్‌లో..)

మరిన్ని వార్తలు