ఇంట్లోకి దూసుకువెళ్లిన గ్రానైట్ లారీ

24 Oct, 2015 02:17 IST|Sakshi
ఇంట్లోకి దూసుకువెళ్లిన గ్రానైట్ లారీ

కామవరపుకోట : అదుపు తప్పిన గ్రానైట్ లారీ ఒక ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇల్లు కూలిపోగా ఇంట్లోవారికి ఎటువంటి ఆపదా కలగలేదు. ఘటన జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి వైపు నుంచి గ్రానైట్ రాళ్లతో వస్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అదుపు తప్పి చౌతనా సెంటర్లో ఉన్న పత్తి ఎర్రంశెట్టి(తాతయ్య) ఇంట్లోకి దూసుపోయింది. దీంతో తాతయ్య పెంకుటిల్లు కూలిపోయింది. పక్కనున్న ఎరువుల దుకాణం గోడ పాక్షికంగా దెబ్బతింది. గ్రానైట్ రాళ్లు లారీపై నుంచి రోడ్డుపై పడ్డాయి.

తాతయ్య కుటుంబం వెనక గదిలో పడుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. తాతయ్య పండ్ల దుకాణం నడుపుతాడు. ఇతను రోజూ తెల్లవారుజామున మూడున్నర గంటలకు దుకాణం తెరుస్తాడు. కామవరపుకోటలో ప్రధాన వ్యాపార కూడలి చౌతనా సెంటర్. ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే బడ్డీలు తెరుస్తారు. దీంతో అప్పటికే జనసంచారం ప్రారంభమవుతుంది. ఈ ఘటనజరిగే సమయానికి జనం ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని కొటికలపూడి ఎస్సై డీజే విష్ణువర్ధన్ తెలిపారు.

మరిన్ని వార్తలు