పోయిన చోటే వెతుక్కుంటున్న అక్రమార్కులు

16 Sep, 2019 07:43 IST|Sakshi
గత వారం మార్టూరులో అధికారులు స్వాధీనం చేసుకున్న ముడిరాయి వాహనాలు

దాడులు జరుగుతున్నా ఆగని అక్రమ వేబిల్లుల వ్యాపారం

విజిలెన్సు అధికారుల ఒంటరి పోరాటం

నిద్ర నటిస్తున్న మైనింగ్, సేల్‌టాక్స్, లా అండ్‌ ఆర్డర్‌ అధికారులు

సాక్షి, ప్రకాశం: మార్టూరు, బల్లికురవ మండలాల కేంద్రంగా కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్, వేబిల్లు వ్యాపారాలపై ఇటీవల విజిలెన్సు అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నకిలీ వేబిల్లులతో వాహనాలు వెళుతూనే ఉన్నాయి. ఇంత నిర్భీతిగా వ్యాపారం ఎలా చేస్తున్నారనే ప్రశ్నకు గ్రానైట్‌ రవాణా సాగిస్తున్న యువకుడు తెలిపిన సమాధానం ఇలా ఉంది.. ‘‘మైనింగ్, సేల్‌టాక్స్‌ అధికారులు మా జోలికి రారు. విజిలెన్సు అధికారులు మాత్రమే మాపై దాడులు నిర్వహిస్తున్నారు. 20 మంది సిబ్బంది, 3 వాహనాలున్న విజిలెన్సు అధికారులు క్వారీలను సోదా చేస్తారా ? మాపై దాడులు చేస్తారా ? జిల్లాపై దృష్టి పెడతారా ? అందుకే వారు దాడులు నిర్వహించిన రెండో పూటే యథేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతున్నాం’’  అని ఆ యువకుడు చెప్పడం గమనార్హం.

కొరవడుతున్న నిఘా వ్యవస్థ:
అక్రమ మైనింగ్‌ వ్యాపారులపై ప్రధానంగా దృష్టి పెట్టవలసిన గనులశాఖ, సేల్‌ టాక్స్‌ అధికారులు గత సంవత్సర కాలంలో నమోదు చేసిన కేసులను వేళ్లపై లెక్కించవచ్చు. కానీ విజిలెన్సు శాఖ తీరు ఇందుకు భిన్నంగా ఉండడం విశేషం. గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో దాడులు నిర్వహించడం ద్వారా ఆ శాఖ వసూళ్ల లక్ష్యం రూ.2.5 కోట్లు కాగా 279 వాహనాలపై దాడులు నిర్వహించడం ద్వారా రూ.6.7 కోట్లు  వసూలు చేయడం గమనార్హం. గత ఏప్రిల్‌తో మొదలైన ఈ ఆర్ధిక సంవత్సరపు వసూళ్ల లక్ష్యం కూడా 2.5  కోట్ల రూపాయలు కాగా గత ఆగస్టు 31 వ తేదీ నాటికే అంటే కేవలం 5 నెలల్లో 3 కోట్ల రూపాయలు పెనాల్టీ రూపంలో వసూలు చేసి లక్ష్యాన్ని అధిగమించడం చూస్తుంటే శాఖల మధ్య గల వ్యత్యాసం ఇట్టే అర్ధమౌతుంది. ప్రస్తుతం మార్టూరు పోలీసులు 15 రోజులుగా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఓ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసును సైతం నెల్లూరు జిల్లాకు చెందిన మైనింగ్‌ శాఖలోని విజిలెన్సు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే అనేది విశ్వసనీయ సమాచారం. ఓ ప్రబుద్ధుడు ఏకంగా 269 బోగస్‌ ఆన్‌లైన్‌ సంస్థలను రిజిస్ట్రేషన్‌ చేయించి కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొట్టిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

అక్రమ వ్యాపారం సాగేదిలా...
మార్టూరు కేంద్రంగా గతంలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు లేని నిరుద్యోగ యువత నకిలీ వేబిల్లుల వ్యాపారాన్ని నిర్వహించగా లోపభూయిష్టమైన జీఎస్‌టీ విధానం వలన ఫ్యాక్టరీల యజమానులు సైతం జీరో వ్యాపారానికి ఒడిగట్టడం గమనార్హం. ప్రస్తుతం నకిలీ వేబిల్లులతో తెలంగాణ వైపు వెళ్లే వాహనాలు మార్టూరు నుంచి బల్లికురవ మీదుగా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్దకు చేరతాయి. అక్కడ ఓ వ్యక్తి వాహనాల బాధ్యతను తీసుకుని లారీకి రూ.11 వేల చొప్పున బేరం కుదుర్చుకుని దాచేపల్లి సమీపంలో రాష్ట్ర సరిహద్దులు దాటవేస్తున్నట్లు సమాచారం. మార్టూరు పోలీసులు ఇటీవల కొంత వరకైనా దాడులు నిర్వహిస్తున్నా బల్లికురవ, సంతమాగులూరు పోలీసులు ఎలాంటి దాడులు చేయకపోగా దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్రిమినల్‌ కేసులకు సిద్ధమవుతున్న అధికారులు
విజిలెన్సు అధికారులు గతంలో ఎన్నిసార్లు దాడులు నిర్వహించి వాహనాలను మైనింగ్‌శాఖ అధికారులకు అప్పగించినా తక్కువ పెనాల్టీతో  దొడ్డిదారిన తప్పించుకుంటున్న నిందితులు తిరిగి యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వైనాన్ని విజిలెన్సు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గత వారం మార్టూరులో స్వాధీనం చేసుకున్న 8 లారీలకు సంబంధించిన డ్రైవర్లు, గ్రానైట్‌ ఫ్యాక్టరీల ఓనర్లతో పాటు క్వారీల యజమానులపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఆరు క్వారీల ఆచూకీ సైతం అధికారులు గుర్తించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మిగిలిన శాఖలు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండగా విజిలెన్సు అధికారులు మాత్రమే దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక నిజాయితీ గల అధికార బదిలీ కోసం క్వారీల యాజమాన్యాలు తీవ్రంగా పైరవీలు నిర్వహించడమే కాక జిల్లా స్థాయి అధికారిపై సైతం విపరీతమైన ఒత్తిడులు తీసుకు వస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కలిసి విధులు నిర్వహిస్తే అక్రమ గ్రానైట్‌ వ్యాపారాన్ని నిరోధించవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

సమన్వయంతో వ్యవహరిస్తే అవినీతికి అడ్డుకట్ట
అవినీతి రహిత పాలనతో ప్రజలకు పునరంకితమవుదాం అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మా సిబ్బంది అహోరాత్రులు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు. మాకు తగినంత సిబ్బంది ఉండి శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తే అవినీతిని అరికట్టడం కష్టమేమీ కాదు. గత ఆగస్టు మూడవ వారం నుంచి అక్రమార్కులపై పెనాల్టీ విధానాలపై స్వస్తి చెప్పి క్రిమినల్‌ కేసులు çనమోదు చేస్తున్నాం.

మరిన్ని వార్తలు