గ్రానైట్‌ రైట్‌ ‘రాతి’రేల కాసుకో

18 Dec, 2019 13:22 IST|Sakshi
చింతలపూడి మీదుగా వెళ్తున్న గ్రానైట్‌లోడ్‌

సరిహద్దుల్లో చెక్‌పోస్టుల కళ్లుగప్పి..

వాహనాలు ఆంధ్రాలోకి ప్రవేశం

రాత్రి 9 గంటలు దాటిన తర్వాతే లోపలికి..

భారీగా ఓవర్‌లోడ్‌ జరిమానాల ఎగవేత

రాష్ట్ర ఆదాయానికి గండి  

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తున్న గ్రానైట్‌ ఓవర్‌లోడ్‌ వాహనాల నిమిత్తం చెల్లించాల్సిన జరిమానా ఎగ్గొట్టేందుకు అక్రమార్కులు పన్నాగం పన్నారు. దీంతో వాహనాలు రాత్రుళ్లు దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రాజమండ్రి–హైదరాబాద్‌ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ సర్కారు, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆంధ్రా ప్రభుత్వం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఓవర్‌లోడ్‌తో వస్తున్న గ్రానైట్‌ వాహనాలు ఈ చెక్‌ పోస్టుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఏపీలోకి వచ్చే వాహనాల నుంచి ఓవర్‌లోడింగ్‌కు టన్నుకు రూ.వెయ్యి చొప్పున అధికారులు వసూలు చేస్తారు. ఒక్కో లారీ 20 టన్నుల వరకూ ఓవర్‌లోడ్‌తో వస్తున్నాయి. అంటే ఒక్కోవాహనానికి రూ.20 వేల వరకూ జరిమానా ఎగ్గొట్టడానికి అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెలంగాణ నుంచి రోజూ వందలాది గ్రానైట్‌ లారీలు మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ, విశాఖ పోర్టులకు వెళ్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆదాయానికి గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

తెలంగాణలో ఉదయం బయలుదేరి..!
తెలంగాణలోని ఖమ్మం, ఇతర జిల్లాల నుంచి గ్రానైట్‌ కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. దీంతో గ్రానైట్‌ లోడ్‌ వాహనాలు ఉదయం తెలంగాణలో బయలుదేరి సాయంత్రం, రాత్రికి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు చేరుకుంటాయి. ఇవి ఎక్కువ ఓవర్‌లోడింగ్‌తో వస్తుంటాయి. ఒక్కో లారీపై సుమారు 60 టన్నుల వరకూ లోడింగ్‌కు అనుమతి ఉంటుంది. అయితే 75 నుంచి 80 టన్నులకుపైగా బరువైన గ్రానైట్‌ రాళ్లతో ఇవి వస్తున్నాయి. ఓవర్‌లోడ్‌ ఉంటే బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద టన్నుకు రూ.వెయ్యి వరకూ జరిమానా చెల్లించాలి. అంటే ఒక్కో లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కట్టాలి. అయితే ఎక్కువ శాతం రవాణాదారులు జరిమానా ఎగ్గొట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.  చాలా వరకూ గ్రానైట్‌ నకిలీ వే బిల్లులతో రవాణా అవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, మైనింగ్‌ టాక్స్‌లూ ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది.  ప్రభుత్వానికి పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన రాయిని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకుతెలిసినా వారు పట్టించుకోరు.  వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లడానికి అభ్యంతర పెట్టకుండా ఉండేందుకు ఆయా శాఖలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రోజుకు 40 నుంచి 60 లారీల వరకూ ఓవర్‌లోడ్‌ తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండురోజల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తే 11 లక్షల రూపాయల వరకూ జరిమానా వసూలైంది.  

కళ్లుగప్పేదిలా..!
గ్రానైట్‌ వాహనాలు అధికారుల కళ్లుగప్పి ఆంధ్రాలోకి ప్రవేశించడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు అశ్వారావుపేట, జీలుగుమిల్లి మీదుగా కాకుండా,  గంగారం నుంచి రాఘవాపురం మీదుగా ఏలూరు చేరుకుని విజయవాడ– కోల్‌కతా హైవే ఎక్కుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం, అడ్డరోడ్డు నుంచి మళ్ళి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా హైదరాబాద్‌ –రాజమండ్రి హెవేపైకి చేరుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఏపీకి రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లల్లో  గండి పడుతోందని సమాచారం. సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి దొడ్డి దారిన వెళ్తున్న వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తే   మన ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రోజూ ఆంధ్రా సరిహద్దులోకి చేరుకున్నాక రాత్రి 9 గంటల తరువాతే ఈ వాహనాలన్నీ చెక్‌ పోస్టులు లేని దారుల్లో నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేసిస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో మరిన్ని చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం ఖాయం.

తనిఖీలు నిర్వహిస్తాం
చెక్‌పోస్టులు తప్పించుకునేందుకు భారీ వాహనాలు వేరే మార్గాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. వాణిజ్యపన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు.– రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌  

మరిన్ని వార్తలు