మహా మాయగాడు

22 Feb, 2014 03:32 IST|Sakshi
మహా మాయగాడు
  • మాటల మరాఠి అంతర్రాష్ట్ర  గజదొంగ అరెస్ట్
  •  రూ. 50 లక్షల విలువచేసే  బంగారు, వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌ల స్వాధీనం
  •  రూ.2 లక్షల నగదు స్వాధీనం
  •  క్రైం పార్టీకి క్యాష్‌రివార్డులతో అభినందించిన ఎస్పీ
  •  తిరుపతి క్రైం, న్యూస్‌లైన్ : అతను చదివింది ఏడో తరగతి. ఏడు భాషలు తెలుసు. డాక్టర్ కోర్సు చదివినట్టు బిల్డప్. ఎప్పుడూ స్టార్ హోటళ్లలోనే మకాం. ఏ హోటల్‌లోనూ మూడు నాలుగు రోజులకు మించి ఉండడు. ఖరీదైన స్నేహితులతో సహవాసం. ఎవరినైనా ఇట్టే పరిచయం చేసుకుని బుట్టలో వేసుకోవడం అతనికి భాషతో పెట్టిన విద్య. అతని మాటకారితనం, డాబూదర్పం చూసి పలువురు ఇతని మోసాలకు బలయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఈ మాటల మరాఠి 39 కేసుల్లో నిందితుడు. ఇతడిని అరెస్ట్ చేసి రూ.50 లక్షల విలువజేసే బంగారు, వెండి ఆభరణాలు, రూ.2లక్షల నగదు, ఎలక్ట్రానిక్ గడియారాలు, సెల్‌ఫోన్లు, రిస్ట్ వాచ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ మేరకు చోరీ సొత్తును శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల ముందు ఉంచారు. నిందితుడి వివరాలను అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. అంతర్రాష్ట్ర గజదొంగ ఆర్.హరీష్ అలియాస్ అరసు అలియాస్ డాక్టర్ హరీష్ అలి యాస్ డాక్టర్ రవికి 55 సంవత్సరాలు. ఇతని సొంత ఊరు కర్ణాటకలోని మైసూ రు ప్రాంతానికి చెందిన శివమొగ్గ. 7వ తరగతి వరకు చదివిన ఇతనికి తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లిష్, హిందీ, ఒరియూ, తుళు భాషలు తెలుసు.

    ఖరీదైన స్నేహితులను ఎంచుకుని వారికి ఫారిన్ టూర్, కన్యాకుమారి, గోవా వెళ్లి వచ్చానంటూ నమ్మించి విలువైన గిఫ్ట్‌లు తెచ్చి ఇస్తుంటాడు. అంతేగాక హరీష్, రవి పేర్ల తో డాక్టర్‌గా అవతారమెత్తి మరి కొంతమందిని పరిచయం చేసుకున్నాడు. అతనినుంచి స్టెతస్కోప్, నాలుగు యాఫ్రాన్ కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మాటలకు ఎవరైనా సరే అతని బుట్టలో పడాల్సిందే. భార్య ఇతని చేష్టలు నచ్చక విడిపోయింది. పిల్లలతో కలిసి మరొకరిని వివాహం చేసుకుని న్యూజెర్సీలో ఉన్నట్లు సమాచారం.
     
    ఎన్ని మోసాలో

    తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, స్టార్ హోటళ్లు, రేణిగుంట, చైన్నైలోని పలు చోట్ల చోరీలు చేశాడు. 2011లో చెన్నైలోని ఎమ్మెల్యే కృష్ణాస్వామి క్వార్టర్స్‌లో దొంగతనం చేసినట్లు రుజువైంది. అక్కడ సెల్‌ఫోన్‌తో పాటు రూ.75 వేల నగదు అపహరించినట్లు తేలింది. 2009లో తిరుపతి, రేణిగుంటలో చోరీలకు పాల్పడ్డాడు. 2012లో తిరుపతిలోని విష్ణునివాసంలో మూడున్నర లక్షల నగదును చోరీ చేసినట్లు తేలింది. ఏడాదిన్న క్రితం అరసు ఈస్ట్ పోలీసులకు పట్టుబడ్డాడు. రికవరీ కోసం పోలీసులు అతన్ని చెన్నైకు తీసుకెళ్లి ఓ లాడ్జిలో దిగారు. అయితే పోలీసుల కన్నుగప్పి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై గురువారం పోలీసులకు పట్టుబడ్డాడు.

    ఈ మేరకు మైసూరులోని అరసు ఇంటి నుంచి విలువైన బంగారు అభరణాలు, వెండి వస్తువులు, నగదు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, చేతి గడియారాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు. నిందితుడిపై క్రైం పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. క్రైం డీఎస్పీ ఎంవీఎస్.స్వామి నేతత్వంలో సీఐలు నాగసుబ్బన్న, మున్వర్‌హుస్సేన్, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లె, సిబ్బంది అరెస్ట్ చేసినట్లు క్రైం పోలీసుల రికార్డులో నమోదైంది. అరుుతే, పోలీసులు అతడు వినియోగిస్తున్న సెల్‌ఫోన్ ఆధారంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఉండగా 20 రోజుల క్రితం క్రైం పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకొచ్చి సొత్తు రికవరీ చేసినట్లు తెలిసింది.
     
    క్రైం పార్టీ పోలీసులకు క్యాష్ రివార్డులు

    అంతర్రాష్ట్ర గజదొంగ అరసును అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం పార్టీ పోలీసులను అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేకంగా అభిందించారు. వారందికీ క్యాష్ రివార్డులను అందచేశారు. క్యాష్‌రివార్డులు అందుకున్నవారిలో సీఐలు నాగసుబ్బన్న, గిరిధర్, మున్వర్‌హుస్సేన్, ఎస్‌ఐలు బీ.ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్లై, క్రైం పార్టీ పోలీసులు మునిరాజా, మురళి, నజీర్, సుధాకర్, శివ, శ్రీనివాసులురెడ్డి, మున్వర్‌బాషా, మునిరత్నం, గంగాధరం, రామయ్య, లవకుమార్, స్వయం ప్రకాష్, శ్రీనివాసులు ఉన్నారు.  
     

మరిన్ని వార్తలు