ప్లాస్టిక్‌ భూతం.. అంతానికి పంతం

27 Oct, 2019 04:31 IST|Sakshi

మానవాళికి పెనుముప్పు ప్లాస్టిక్‌

నింగి, నేల, నీరులో రేణువులుగా మారుతూ ఆరోగ్యానికి పెనుసవాల్‌ విసురుతున్న వైనం

జీవరాశికీ శాపం

ప్రజల్లో పెరుగుతున్న ప్టాస్టిక్‌ నిషేధంపై అవగాహన

వివిధ కార్యక్రమాల ద్వారా నిషేధం వైపు అడుగులు

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణవిుంచింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచి్చన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్‌ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అనర్థాలపై పౌరసమాజం స్పందిస్తోంది. ఇదిలా ఉద్యమరూపం సంతరించుకుంటే ఉపద్రవం తొలగుతుందన్న భరోసా కలుగుతోంది. 

రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్‌ ఫోమ్‌ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్‌ పీనట్స్, కోట్‌ హ్యాంగర్స్, యోగర్ట్‌ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. 

రీసైక్లింగ్‌ మేనేజ్‌ చేయగలిగినవి  
ప్యాకేజింగ్‌ ఫిలిం, షాపింగ్‌ బ్యాగ్స్, బబుల్‌ ర్యాప్, ఫ్లెక్సిబుల్‌ బాటిల్స్, వైర్‌ అండ్‌ కేబుల్‌ ఇన్సులేషన్, బాటిల్‌ టాప్స్, డ్రింకింగ్‌ స్ట్రాస్, లంచ్‌ బాక్సులు, ఇన్సులేటెడ్‌ కూలర్లు, ఫ్య్రాబ్రిక్‌ అండ్‌ కార్పెట్‌ టారప్స్, డైపర్స్‌.

తెనాలి (గుంటూరు జిల్లా): ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్‌ అండ్‌ త్రో’ ప్లాస్టిక్‌ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా రూపొందించాలని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది.

ప్లాస్టిక్‌ వస్తువులకు కూరగాయలు...
గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటి తెనాలిలో రోజుకు అర టన్ను చొప్పున నెలకు 15 టన్నులు ప్లాస్టిక్‌ చెత్త వస్తోంది. రీసైక్లింగ్‌కు వీలుకాని 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను మున్సిపాలిటీ నిషేధించింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తడిచెత్త, పొడిచెత్త పేరుతో వేర్వేరుగా చెత్తను సేకరించటమే కాకుండా ప్లాస్టిక్‌ చెత్తను కూడా సేకరిస్తున్నారు. ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత ఇక్కడి గాంధీనగర్‌ రైతుబజారులో ‘ప్లాస్టిక్‌ వస్తువులు ఇచ్చి వెళ్లండి...కూరగాయలు తీసుకెళ్లండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చేతుల మీదుగా చేపట్టారు. స్వచ్ఛందంగా ముందు కొచ్చిన రైతులు షేక్‌ అబ్దుల్‌ రషీద్, రావిపూడి శ్రీనివాసరావు స్టాల్స్‌లో అమలు చేస్తున్నారు. 
‘ప్లాస్టిక్‌కు బదులుగా కూరగాయలు’ ప్రారంభంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్‌ ఆరోగ్యాధికారి డాక్టర్‌ బీవీ రమణ తదితరులు 

ఉచితంగా క్లాత్‌ బ్యాగులు..
ప్రతిరోజూ 10 కిలోలకు పైగా వస్తువులను ఇచ్చి కూరగాయలు తీసుకెళుతున్నట్టు రైతుబజారు ఏస్టేట్‌ అధికారి గుంటూరు రమేష్‌ చెప్పారు. ప్లాస్టిక్‌ను శానిటేషను సిబ్బంది తీసుకెళుతున్నారు.  స్పందించిన శారదా సర్వీస్‌ సొసైటీ నిర్వహించిన వైద్యశిబిరంలో, గుడ్డతో చేసిన చేతిసంచులను ప్రజలకు పంపిణీ చేయటం విశేషం. ఇదేరీతిలో సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ సంస్థ పేరుతో 500 చేతిసంచులను రూపొందించి, సభ్యులకు, స్థానికులకు పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు.

ప్లాస్టిక్‌ వస్తువులకు నోటుపుస్తకాలు...
నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు సహకారంతో కృష్ణా బాలకార్మిక విద్యాలయ పథకం ఇదే తరహాలో ప్లాస్టిక్‌ సేకరణకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి కాలనీలోని పాఠశాలలో విద్యార్థులను కలిశారు. ఎవరైతే ప్లాస్టిక్‌ సీసాలు, వ్యర్థాలను సేకరించి తీసుకొస్తారో వారికి నోటు పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాఠశాల్లోని 120 మంది విద్యార్థులు కాలనీలో తిరిగి, వ్యర్థాలను సేకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆంజనేయరెడ్డికి అందజేశారు. తొలిరోజునే ఆ విధంగా 50 కిలోల ప్లాస్టిక్‌ చెత్త వచ్చింది. కిలోకు లాంగ్‌ సైజ్‌ నోటుబుక్‌ చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ విధానాన్ని కొనసాగిసూ్తనే కృష్ణాజిల్లాలోని 16 బాల కార్మిక పాఠశాలల్లో అమలు చేస్తామని ఆంజనేయరెడ్డి ప్రకటించారు. సేకరించిన ప్లాస్టిక్‌ చెత్తను విజయవాడ నగర పాలక సంస్థకు అప్పగిస్తున్నారు. 

ఎక్స్‌పైరీ తేదీ లేని ప్లాస్టిక్‌...
ఏ వస్తువుకైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది...ప్లాస్టిక్‌ మినహా అని చెప్పాలి. వీటిలో ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్‌ మూతలు, స్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్‌లెట్లు, చిప్స్‌ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్‌’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్‌ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్‌ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నాయని వెల్లడెంది.

రీసైక్లింగ్‌ చేయదగిన వస్తువులు...
బేవరేజ్‌ బాటిల్స్, ఫుడ్‌ జార్స్, క్లాతింగ్‌ అండ్‌ కార్పెట్‌ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్‌ బాటిల్స్‌.డిటర్జంట్, బ్లీచ్‌ బాటిల్స్, స్నాక్‌ బాక్సులు, మిల్కా జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్‌ ఫర్నిచర్, చెత్త కుండీలు

రీసైక్లింగ్‌ అతికష్టం 
క్రెడిట్‌ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్స్, వైర్, కేబుల్, సింథటిక్‌ లెదర్, నైలాన్‌ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్‌ డిసు్కలు, మెడికల్‌ స్టోరేజి కంటైనర్స్, కార్‌ పార్ట్స్, వాటర్‌ కూలర్‌ బాటిల్స్‌.

ఉడతా భక్తి సాయం...
ఆరేళ్లుగా రైతుబజారులో ఉంటున్నా...ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఆ చెత్త సేకరణకు నేనూ, మరో రైతు ఉడతాభక్తిలా సహకరించాలని ప్లాస్టిక్‌ను తీసుకుని కూరగాయలు ఇస్తున్నాం. కనీసం ఒక నెలరోజులు ఇస్తాం.              
 – షేక్‌ అబ్దుల్‌ రషీద్, రైతు

రాష్ట్రంలోనే తొలిసారి...
రైతుబజారులో ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకుని కూరగాయలు ఉచితంగా ఇవ్వడం ఇదే తొలిసారి. సామాజిక బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం.    
– గుంటూరు రమేష్, ఏస్టేట్‌ అధికారి, రైతుబజారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా