అతను కత్తెర పడితే ఇక అంతే..! ఎవరి మాట వినడు!!

26 Jul, 2019 11:41 IST|Sakshi

అను'మతి' లేకుండా ఆపరేషన్లు

సాక్షి, గుంటూరు: ఆపరేషన్‌ సమయంలో ఇచ్చిన మత్తు కొద్ది కొద్దిగా వదిలే కొద్దీ నొప్పుల బాధ సూది గుచ్చినట్లు ఉంటుంది. పక్కన బంధువులు ఆత్మీయ స్పర్శ కోసం అర చేయి వెతుకులాడుతుంది. పొత్తిళ్ల బిడ్డ పాల కోసం గుక్క పెట్టినప్పుడు.. నొప్పుల బాధను భరించి.. కాస్త కదులుదామంటే కటిక నేలపై మూటలా పడి ఉన్న శరీరం సహకరించక కళ్లలో నీటి ఊట ధారలవుతోంది. ఇదీ రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న బాలింత దుస్థితి.

ఎందుకంటే ఇక్కడ వైద్యుడు అనుమతి లేకుండానే ఆపరేషన్లు చేస్తుంటాడు. ఆస్పత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉంటే ఈయన రోజుకు 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేసి బాలింతలను నేలపై పడుకోబెడుతుంటారు. ఇదంతా రోగులపై ప్రేమతోకాదు.. ఆయనకు వచ్చే పారితోషికానికి ఆశపడి. దీనిపై ఉన్నతాధికారులు మందలించినా ఆయన తీరులో మార్పు లేదు. ఈ వైద్యుడు చేసే ఆపరేషన్లతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం కుటుంబ నియంత్రణ( కు.ని) ఆపరేషన్లు మాత్రమే పరిమిత సంఖ్యలో చేయాల్సి ఉండగా జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్‌ ప్రతి రోజూ 10 నుంచి 30 వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. సుమారు 10 రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 30 ఆపరేషన్లు చేశాడు. అక్కడ సరిపడా పడకలు లేకపోవటంతో కటిక నేలపైనే ఆపరేషన్లు చేయించుకున్నవారిని పడుకోబెట్టాడు. ఆపరేషన్‌ చేసినందుకు తనకు వచ్చే తీసుకుని సదరు వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలిసి అక్కడకు వెళ్లి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి ప్రతి రోజూ 5 నుంచి ఆరు వరకు మాత్రమే ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. అయినా సదరు వైద్యుడు మారలేదు. 

పడకలు ఆరు మాత్రమే
జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. కానీ సదరు డాక్టర్‌ ప్రతి రోజూ పదికిపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో పడకలు లేక ఆపరేషన్‌ చేయించుకున్న వారిని నేలపైనే పడుకోబెడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సదరు వైద్యుడు ఆపరేషన్లు చేయటం, వైద్య సిబ్బంది కూడా చోద్యం చూస్తూ ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాకుండా ఇతర ఆపరేషన్లు సైతం అనుమతి లేకపోయినా చేసేవారు. దీంతో ఆపరేషన్‌ చేయించుకున్న వారు చనిపోవటంతో గుంటూరులో పెద్ద రగడ జరిగింది. గత ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో కేసు రాజీ చేయించుకుని బయటపడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో ఇతర ఆపరేషన్లు కూడా ఆయన చేస్తున్నారనే అనుమానాన్ని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.

ఆపరేషన్లకు అనుమతులు లేవు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు నియమాలు పాటించాలి. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులే శిక్షణ తీసుకుని ఆపరేషన్లు చేస్తుంటారు. ఒక వేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన వైద్యులు ఉంటే వారికి ఆపరేషన్‌పై పట్టు వచ్చే వరకు సీనియర్‌ వైద్యులను అక్కడకు వెళళ్లి చేయాలని జిల్లా వైద్యాధికారులు ఉత్తర్వులు ఇస్తుంటారు.

డబ్బులు కోసం అత్యాశతో అధిక సంఖ్యలో వైద్య సౌకర్యాలు కల్పించకుండా ఆపరేషన్లు చేస్తున్న సదరు వైద్యుడికి రాజధాని ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ డాక్టర్‌ తనకు అనుమతి ఇవ్వని ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఆపరేషన్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఆపరేషన్‌ చేసి వెళ్ళిపోతే అక్కడ సరిపడా వైద్య సౌకర్యాలు లేక ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ఏదైనా రియాక్షన్స్‌ వస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వాపోవుతున్నారు. సాక్షాత్తూ జిల్లా వైద్యాధికారే ఆయన్ని అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయవద్దని హెచ్చరించినా పట్టించుకోకుండా ఆపరేషన్లు చేయటంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు