స్వర్ణముఖిపై భూ రాబందులు!

15 Oct, 2014 04:19 IST|Sakshi
స్వర్ణముఖిపై భూ రాబందులు!
  • ఆక్రమిత భూముల్లో ఆకు కూరల సాగు
  •  యథేచ్ఛగా ఆక్రమణలు    
  •  మురుగునీరే సాగునీరు
  •  వ్యాపిస్తున్న వ్యాధులు     
  •  చోద్యం చూస్తున్న అధికారులు
  • స్వర్ణముఖి. ఈ నది పవిత్రతకు మారుపేరు. కనుచూపు మేరా ఇసుక.. పవిత్ర జలం..ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. మురుగు నీటికి, ఆక్రమణలకు నిలయంగా మారింది. కొందరు ఇసుకను సైతం చదునుచేసి పంటలు వేస్తున్నారు. వీటికి గృహాలు, హోటళ్లు, లాడ్జీల నుంచి వచ్చే మురుగునీటిని మళ్లిస్తున్నారు. ఇక్కడ పండించే ఆకు కూరలు చూసేందుకు పచ్చగా, ఏపుగానే ఉంటాయి. లోతుగా చూస్తే గానీ తెలియదు అది మురికినీటితో సాగు చేసిన పంట అని. ఇది తెలియక వినియోగదారులు కొనుగోలుచేసి ఆస్పత్రుల పాలువుతున్నారు.
     
    శ్రీకాళహస్తి టౌన్: శ్రీకాళహస్తి పట్టణానికి ఆనుకుని స్వర్ణముఖి నది ఉంది. ఒకప్పట్లో ఈ నది పవిత్రతకు మారుపేరుగా ఉండేది. ఇప్పుడు ఆక్రమణలకు నిలయంగా మారింది. నది సమీపంలో ఉన్న కొందరు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. రామసేతు వంతెన వద్ద ఈ తంతు మరీ ఎక్కువ. నది కట్టకు ఆనుకుని ఉన్న ఇసుకను చదును చేసి సుమారు ఎకరా విస్తీర్ణాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ స్థలం చుట్టూ కంప నాటి ఎంచక్కా పంటలు వేస్తున్నారు.
     
    ఆకుకూరలే ప్రధాన పంటలు


    ఆక్రమిత స్థలంలో చిర్రాకు, తోటాకు, పుల్లగూర, పచ్చలకూర, కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలు సాగుచేస్తున్నారు. మురుగు నీటికారణంగా పంట ఏపుగా వస్తోంది. నెలకు రెండు పంటలు వేయవచ్చు. ఎండాకాలంలోనూ నీటి సమస్య ఉండదు. అడిగేవారు లేకపోవడంతో రోజురోజుకూ ఆక్రమణల జోరు పెరుగుతోంది.
     
    మార్కెట్ల నిండా ఇక్కడి పంటలే

    ఇక్కడ పండించే ఆకుకూరలు స్థానిక మార్కెట్‌కు, నాయుడుపేట, రేణిగుంట, ఏర్పేడు, మల్లారం, తిరుపతి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఆకు ఏపుగా పెరిగి నిగనిగ మెరవడంతో విని యోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చిర్రాకు కట్ట రూ.7కుపైగా విక్రరుుస్తున్నట్టు తెలుస్తోంది. అన్‌సీజన్ లో రూ.పదికి పైనే.
     
    వ్యాధులు ఖాయం

    మురుగునీటి కారణంగా పండించే ఆకుకూరలు తినడం వల్ల వ్యాధులు సక్రమిస్తున్నారుు. టైఫాయిడ్, మలేరియూ, స్కిన్ అలర్జీ తదితర రోగాలు సోకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆస్పత్రికి వెళ్లితే కానీ అసలు విషయం తెలియడంలేదు. అక్కడి వైద్యులు ఆహా ర పదార్థాల వల్ల వ్యాధులు ప్రబలుతున్నట్టు చెబుతున్నారని పలువురు రోగులు అంటున్నారు.
     
    భూగర్భజలాలూ కలుషితం

    పట్టణం నుంచి వచ్చే మురుగు నీటిని చెంబేడు కాల్వకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం స్వర్ణముఖి నదిలో పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు.  మరో వైపు రామసేతు వంతెన అవతల, ఇవతల మురుగునీరు నదిలోకి ప్రవహిస్తోంది. ఈ నీరు నదిలో ఏర్పాటు చేసిన బావుల చుట్టూ చేరుతోంది. ఫలితంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికే మూడు బావులను మూసివేశారు. కొన్ని కాల్వల నుంచి వచ్చేనీటిని నదిలో ఆక్రమిత భూములకు మళ్లిస్తున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు కనిపించినా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
     

మరిన్ని వార్తలు