రైల్వే జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ 

28 Feb, 2019 03:55 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పీయూష్‌

గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో నూతన జోన్‌ ఏర్పాటు

వాల్తేరు డివిజన్‌లో ఒక భాగం విజయవాడ డివిజన్‌లోకి

ప్రధాని పర్యటనకు ముందుగా పచ్చ జెండా ఊపిన రైల్వే మంత్రి

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

దేశంలో ఇది 18వ రైల్వేజోన్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్ల 9 నెలలు గడుస్తున్న సమయంలో ఏపీకి ఎట్టకేలకు కేంద్రం తీపి కబురు అందించింది. విశాఖ కేంద్రంగా ఏపీలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా దేశంలో 18వ రైల్వే జోన్‌ ఏర్పాటు కానుంది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడటం గమనార్హం. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం రాత్రి రైల్వే భవన్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

వాల్తేరు డివిజన్‌ను రెండుగా విడగొట్టి జోన్‌
‘విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కొత్త రైల్వే జోన్‌ను ‘దక్షిణ కోస్తా రైల్వే (ఎస్‌సీఓఆర్‌)’గా వ్యవహరిస్తారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి ఈ రైల్వే జోన్‌ ఉంటుంది. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా నూతన రైల్వే జోన్‌ కిందికి తెస్తాం. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటు చేస్తాం. అది తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లతో కూడుకుని ఉంటుంది’ అని రైల్వే మంత్రి ప్రకటించారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఎప్పటిలోగా ఉనికిలోకి వస్తుందన్న మీడియా ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ‘రైల్వే బోర్డు, రైల్వే శాఖ కలసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. తదుపరి విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు. అది మినహా రైల్వే జోన్‌కు సంబంధించిన ఇతర ప్రశ్నలపై మంత్రి స్పందించలేదు. 

ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు..
దేశంలో ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల విస్తృతి, పరిమాణం, పనిభారం, అవకాశం, ట్రాఫిక్, పాలన అవసరాల అధారంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. చివరిగా 2003–04లో రైల్వే జోన్లను పునర్‌ వ్యవస్థీకరించారు. ప్రస్తుతం ముంబై కేంద్రంగా సెంట్రల్‌ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా ఈస్టర్న్‌ రైల్వే, హజీపూర్‌ కేంద్రంగా ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, భువనేశ్వర్‌ కేంద్రంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, న్యూఢిల్లీ కేంద్రంగా నార్తర్న్‌ రైల్వే, అలహాబాద్‌ కేంద్రంగా నార్త్‌ సెంట్రల్‌ రైల్వే, గోరఖ్‌పూర్‌ కేంద్రంగా నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే, గౌహతి కేంద్రంగా నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే, జైపూర్‌ కేంద్రంగా నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే, చెన్నై కేంద్రంగా సదరన్‌ రైల్వే, సికింద్రాబాద్‌ కేంద్రంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే , కోల్‌కతా కేంద్రంగా సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, బిలాస్‌పూర్‌ కేంద్రంగా సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, హుబ్లీ కేంద్రంగా సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే, ముంబై కేంద్రంగా వెస్టర్న్‌ రైల్వే, జబల్‌పూర్‌ కేంద్రంగా వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా మెట్రో రైల్వే జోన్‌లు పని చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌ కానుంది. 
 
ద.మ. రైల్వేలో ఆరు డివిజన్లు...
సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు తాజాగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి వెళతాయి. కొత్త రైల్వే జోన్‌ పరిధిలో జోనల్‌ స్థాయి రైల్వే ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలు, రైల్వే పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. 

మోదీకి జీవీఎల్, బీజేపీ నేతల ధన్యవాదాలు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటిస్తూ ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధాని విశాఖ వస్తున్న సందర్భంగా మరిచిపోని కానుక వచ్చింది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలతోపాటు రైళ్ల లభ్యత కూడా సులభం కానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కూడా ఏర్పాటు కానుంది’ అని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం జాతీయ వైస్‌ ఛైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, బీజేపీ సమన్వయకర్త పి.రఘురాం బుధవారం రాత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

దశాబ్దాల కల నెరవేర్చిన మోదీ: కన్నా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్‌ ప్రకటించడం ద్వారా ప్రధాని మోదీ దశాబ్దాల ఆంధ్రుల కలను నెరవేర్చారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేశారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా ఏపీ అభివృధ్ధే బీజేపీ లక్ష్యమని మరోసారి నిరూపించారన్నారు. 

ప్రజల పోరాట ఫలితం: రఘువీరారెడ్డి
విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన ఐదు కోట్ల మంది ప్రజల పోరాట ఫలితమని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని విశాఖ పర్యటనలో ప్రజలు తీవ్ర నిరసన తెలపడానికి సిద్ధపడటంతో హడావిడిగా ఈ ప్రకటన చేశారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే తరుణంలో రైల్వే జోన్‌ ప్రకటించడం వల్ల ఏం ఒరుగుతుందని ప్రశ్నించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత జోన్‌ పనుల బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా