వైఎస్సార్‌ రైతు భరోసాకు నేడు గ్రీన్‌ సిగ్నల్‌

10 Jun, 2019 03:31 IST|Sakshi

ఎనిమిది అంశాలపై ఆమోద ముద్ర వేయనున్న కేబినెట్‌

ఈ ఏడాది రబీ నుంచే రైతులకు పెట్టుబడి సాయం

పెన్షన్లు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు జీతాల పెంపు..

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం

హోంగార్డుల వేతనం పెంపు, ఉద్యోగులకు ఐఆర్‌

సాక్షి, అమరావతి: దేశానికి తిండి పెట్టే రైతులకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్వహిస్తున్న తొలి కేబినెట్‌లోనే ముందడుగు వేయనున్నారు. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు. ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి ఒక్కో రైతు కుంటుంబానికి పెట్టుబడి సాయంగా 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ఈ రబీ నుంచే అందివ్వాలని, ఈ మేరకు తొలి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగం సమీక్షలో రబీ నుంచే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ మంత్రిమండలి సమావేశం ఆమోదించాల్సి ఉంది. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి వైఎస్సార్‌ భరోసా పథకం అమలును పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడనున్న అంశాలు
– వచ్చే నెల నుంచి అవ్వా తాతలు, వితంతువులతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులకు రూ.2,250, వికలాంగులకు రూ.3,000.. డయాలసిస్‌ రోగులకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పింఛన్‌ పెంపు 
– పింఛన్‌ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
– ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై నిర్ణయం 
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి, హోం గార్డులు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం
– రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్ల వేతనాలను రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు. 

సీపీఎస్‌పై టక్కర్‌ కమిటీ సిఫార్సులపై నిర్ణయం
కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)పై గత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ సీఎస్‌ టక్కర్‌ కమిటీ సిఫార్సులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు తక్కువ పెన్షన్‌ వస్తున్న మాట వాస్తవమేనని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయడమా లేక సీపీఎస్‌ పెన్షన్‌ పాత పెన్షన్‌ విధానం మధ్య ఉన్న వ్యత్సాసాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడమా.. వంటి చర్యలను ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా టక్కర్‌ కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీపీఎస్‌ విధానంలోకి వెళ్లడమా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో సీపీఎస్‌ అమల్లో ఉందని, అయితే అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని టక్కర్‌ కమిటీ పేర్కొంది. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని వివరించింది. సీపీఎస్, పాత పెన్షన్‌ మధ్య ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌ వ్యత్యాసంలో తగ్గింపు లాంటి ప్రతిపాదనలను ఈ కమిటీ నివేదించింది. ఈ కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే..
– సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేయకుండా, పాత పెన్షన్‌ విధానం.. సీపీఎస్‌ విధానం మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు రూ.5,000 కోట్ల నుంచి రూ.6,000 కోట్లు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు.
– రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటును 10 నుంచి 20 శాతానికి పెంచడం.
– 2004 నుంచి 2018 వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై వన్‌టైమ్‌ బర్డన్‌ రూ.2,864.21 కోట్లు .. 2019ని కూడా కలిపితే మరో రూ.1,729 కోట్లు అవుతుంది.
– పాత పెన్షన్‌ ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు, సీపీఎస్‌ ఉద్యోగులకు వచ్చేదాని మధ్య వ్యత్యాసం 75 శాతం.
– రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ 20 శాతం భరించినా ఇంకా 50 శాతం తక్కువగానే ఉంటుంది.
– రాష్ట్రంలో 1.70 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెరో పది శాతం కలిపితే ఈ పెన్షన్‌ నిధిలో గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఉండే మొత్తం రూ.5,728.42 కోట్లు
– సీపీఎస్‌ రద్దు చేసిన పక్షంలో ఈ నిధిని వెనక్కు తీసుకోవడంలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే విషయాన్ని ఆలోచించాలి.

మరిన్ని వార్తలు