పచ్చధనం పక్కదారి

17 Aug, 2013 02:04 IST|Sakshi


 భైంసా, న్యూస్‌లైన్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఇటీవల అధికారులు బాసర ట్రిపుల్ ఐటీకి అనంతపురం జిల్లా నుంచి 200 రాగి, మర్రి మొక్కలు తెప్పించారు. ఒక్కో మొక్కను రూ.250కి కొనుగోలు చేసి, రవాణా చార్జీల కింద ఒక్కో మొక్కకు రూ. 50 వెచ్చించారు. ఇలా 300 మొక్కలకు రూ.60 వేలు ఖర్చు చేశారు. మొక్కలు నాటాకా నల్లమట్టిపై ఎర్రమట్టి వేస్తామంటూ మరో 30 ట్రిప్పులకు మట్టి ఆర్డరు ఇచ్చారు. బాసర నుంచి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న యంచ గ్రామం నుంచి మట్టిని తెప్పించారు. ఒక్కో ట్రిప్పుకు రూ.3 వేల చొప్పున 30 ట్రిప్పులకు రూ.90 వేల ఖర్చు చేశారు. మొక్కల చుట్టూ ఎర్ర మట్టికి బదులు ఎర్ర మొరం కనిపిస్తోంది. ఎర్ర మట్టిగా చెప్పే ఎర్రమొరంలో అన్ని  బండరాళ్లే ఉన్నాయి. ఇలాంటి మొరం గ్రామాల్లో రూ.300 ట్రిప్పు దొరుకుతుంది. ఇలా రూ. 9 వేలకు దొరికే ఎర్ర మొరాన్ని రూ.90 వేలు వెచ్చించి అధికారులు కొనుగోలు చేశారు.
 
 ఉచితంగా లభిస్తున్నా..
 పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసింది. అటవీ శాఖ అధికారులు వర్షాలు కురియగానే ఏటా అన్ని రకాల మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తారు. రోడ్లపై మొక్కలు నాటి అటవీ శాఖ అధికారులే నీళ్లు పోస్తారు. మహాత్మాగాంధీ జాతీయ వననర్సరీల్లోనూ ప్రభుత్వం లక్షల మొక్కలను పెంచుతోంది. జిల్లాలోనే ఉచితంగా మొక్కలు దొరికే మార్గం ఉన్నా ట్రిపుల్ ఐటీ అధికారులు డబ్బులు వెచ్చించి అనంతపురం జిల్లా నుంచి కొనుగోలు చేశారు. పైగా అక్కడి నేలలకు మన నేలలకు వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రాంతంలో మన నేల స్వభావాలకు అనుకూలంగా పెరిగే మొక్కలనే వననర్సరీల్లో పెంచుతారు. కానీ అధికారులు మాత్రం అవేవి లెక్కలోకి తీసుకోకుండా రూ.60 వేలు మొక్కలు తెప్పించడానికి వెచ్చించారు. ఇంకా కొన్ని మొక్కలు తెప్పిస్తామని అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి డబ్బులు వృథా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవే మర్రి, రాగి మొక్కలు ముథోల్ మండలం తరోడ గ్రామంలో వననర్సరీల్లో వీటి ధర అడిగితే రూ.100 లోపు ఉంటుందని చెప్పారు. కాని అధికారులు మాత్రం రూ. 250తో వాటిని కొనుగోలు చేశారు. అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపితే ఆ మొక్కలు కాస్త ఉచితంగా దొరికేవి.
 
 పెంచడంపై శ్రద్ధ లేదు..
 అనంతపురం నుంచి బాసరకు మొక్కలు తెప్పించిన అధికారులకు పచ్చదనంపై ఎంత పట్టింపో అనుకుంటే పొరపాటే. మొక్కలు తీసుకువచ్చిన అధికారులు అవి నాటిన ఆవరణలో ఎలా ఉన్నాయో కూడా చూడడం లేదు. ఒక పక్కన పశువులు మరో పక్కన గొర్రెలు రోజు ఇక్కడే మేపుతున్నారు. పశువులు నాటిన మొక్కలను తొక్కేస్తున్నాయి. గొర్రెలు మొక్కలకున్న ఆకులను తినేస్తున్నాయి. నాటిన మొక్కల చుట్టూ వర్షపు నీరు చేరింది. ఎర్ర మట్టిగా చెప్పుకునే ఎర్రమొరం కుప్పలు అలాగే పడి ఉన్నాయి. నల్లమట్టిపై ఎర్ర మట్టి వేయకపోవడంతో మొక్క చుట్టూ వర్షపు నీరు చేరి అన్ని వాడిపోతున్నాయి. వాడిపోయిన మొక్కలను పక్కన పారేశారు. నాటాల్సిన మొక్కలను అలాగే వదిలేశారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు మొక్కలను ఎలా పెంచుతారో ఎవరికి అంతుచిక్కడం లేదు.
  తొందరగా పెరిగేందుకే.
 .- నారాయణ, ట్రిపుల్ ఐటీ ఓఎస్‌డీ
 తొందరగా పెరిగేందుకే ఎత్తుగా ఉన్న మొక్కలను దూరం నుంచి తెప్పించాం. అటవీశాఖ మొక్కలు చిన్నగా ఉంటాయి. అవి తొందరగా పెరగవు. అందుకే అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ నాటించాం. ముందు తీసుకొచ్చిన ఎర్రమట్టి బాగుంది. మళ్లీ తీసుకువచ్చిన ఎర్రమట్టి బాగాలేదని నిలిపివేశాం. మేము ఏమి చేసిన యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నాం.
 

>
మరిన్ని వార్తలు