పేట్రేగిన దొంగలు

3 Dec, 2014 02:53 IST|Sakshi
పేట్రేగిన దొంగలు

సాక్షి, గుంటూరు/వట్టిచెరుకూరు/విద్యానగర్: జిల్లాలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ దొంగలు లరేగిపోతున్నారు. ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడుతున్నారు. గ్రామ శివారులో ఉన్న ఇళ్లు,పెట్రోలు బంకులే లక్ష్యంగా బీభత్సం సృష్టిస్తున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో దోపిడీ దొంగల ముఠాలు సంచరిస్తున్నట్టు గత నెల 19న నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి.

 
 దోపిడీకి యత్నించే సమయంలో అడ్డుకునేవారిపై కత్తులు, రాడ్లతో దాడులు చేయడానికి కూడా ముఠాలు వెనకాడబోవని నిఘా వర్గాలు చెప్పిన మాటలు అక్షరాలా జరుగుతున్నాయి.
 
  ఈ హెచ్చరికలకు పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పందించిన దాఖలాలు లేవనడానికి జిల్లాలో వరసగా జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలే సాక్ష్యాలు.. నిఘా వర్గాలు హెచ్చరించిన పది రోజుల్లోనే రెండు దోపిడీలు జరగడం పోలీస్ అధికారుల పనితీరును శంకిస్తోంది. వట్టి చెరుకూరు శివారులో ఉన్న పెట్రోలు బంకు(ఆగ్రో అండ్ ఆయిల్ ఫిలింగ్ స్టేషన్)పై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, అందులో పనిచేస్తున్న ముగ్గురు యువకులను తీవ్రంగా గాయపరచి  రూ. ఆరువేల నగదు దోచుకెళ్లారు.
 
  వట్టిచెరుకూరు నెహ్రూనగర్‌కు చెందిన కారుమూరి చిన్నబాబు, రెంటచింతల మండలం పాల్వారుు గ్రామానికి చెందిన దాదిబత్తిన మణికంఠ, గాలి సత్యనారాయణ సాయంత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి 11గంటల వరకూ వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని యజమానికి ఇచ్చేసి, రాత్రి మేనేజర్ రూమ్‌లో పడుకున్నారు.  వేకువజామున కొందరు  దుండగులు వచ్చి పెట్రోలుకావాలని అడిగారు.
 
  తలుపు తెరచిన యువకులపై ఇనుపరాడ్లతో దాడిచేసి విచక్షణారహితంగా కొట్టి వారి వద్ద ఉన్న దాదాపు రూ. ఆరువేల రూపాయలు అపహరించుకుపోయూరు. వెళ్తూ వెళ్తూ బయట గడిపెట్టారు. ఉదయం 5గంటల ప్రాంతంలో పెట్రోలు కోసం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రవి రాగా గది నుంచి రక్తపు మరకలతో ఉన్న చెయ్యి ఎత్తి బాధితుడు సైగ చేశాడు. రవి  దగ్గరకు వెళ్లి చూసి పరిస్థితిని అర్థం చేసుకుని  గ్రామానికి చెందిన వల్లూరి గోపాలకృష్ణ అనే వ్యక్తికి విషయం చెప్పాడు.

వెంటనే ఆయన బంక్ మేనేజర్ శివకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బంకు ఓనర్ శ్రీనివాస రెడి అక్కడకు చేరుకుని   రక్తపుమడుగులో ఉన్న యువకులను 108 ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  క్షతగాత్రులను పరీక్షించిన వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై ప్రసాద్ రెడ్డి అందించిన సమాచారంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.
 
 వరికోత మెషిన్‌వద్ద ఆగిన జాగిలాలు
 పోలీసు జాగిలాలు వచ్చి పెట్రోలు బంకునుంచి ఎదురుగా ఉన్న వరికోత మెషిన్‌వద్దకు చేరుకుని, అక్కడినుంచి గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ సమీపంలోగల వరికోత మెషిన్ డ్రైవర్ సేవిక్, క్లీనర్ భూటాసింగ్ ఉండే గదివద్ద తచ్చాడారుు.
 
 పంజాబ్ నుంచి వరికోత మెషిన్ నిర్వహణకు ఇద్దరిని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ వచ్చిన ఇద్దరిపైనే పోలీసులు అనుమానిస్తున్నారు. వరికోత మెషిన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, సౌత్ జోన్ డీయస్పీ నరసింహ, సీఐ శ్రీనివాసరావు చేరుకుని పరిశీలించారు.
 
 పోలీసుల అలసత్వం వల్లే దోపిడీలు
 జిల్లాలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనాలు వరసగా జరుగుతున్నా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత నెల 21న గోరంట్ల గ్రామంలో ఊరి బయట ఉన్న ఓ గృహంలోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు  పని మనిషిని కట్టి పడేసి యథేచ్ఛగా ఇల్లు దోచుకున్నారు. సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తుతోపాటు నగదును దర్జాగా కారులో తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటనలో ఎవరిపైనా దాడి చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
 
 బదిలీలపై చూపుతున్న శ్రద్ధ విధులపై చూపించడం లేదని, దీంతో పోలీసు శాఖ నిద్రావస్థలోకి వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. వరసగా సంఘటనలతో పెట్రోలు బంకులు, వైన్స్‌లు, రెస్టారెంట్‌లు, ఊరికి దూరంగా ఉండే గృహాల్లో ఉండే వారు భయాందోళనకు గురవుతున్నారు.
 

మరిన్ని వార్తలు