గ్రేహౌండ్స్‌నూ విడగొట్టాల్సిందే

12 Apr, 2014 00:38 IST|Sakshi
గ్రేహౌండ్స్‌నూ విడగొట్టాల్సిందే

ఉమ్మడిగా ఏడాది శిక్షణ .. సీమాంధ్ర సెంటర్ విశాఖలో ఏర్పాటు ?
గవర్నర్ సలహాదారు రాయ్‌కు     వివరించిన అధికారులు
సిబ్బందిని 58.37 : 41.63 నిష్పత్తిలో విభజన


 హైదరాబాద్: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో దేశంలో పేరెన్నికగన్న  గ్రేహౌండ్స్ విభాగాన్ని ఆంధ్ర, తెలంగాణల కోసం రెండుగా విభజించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్ శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. డీజీపీ ప్రసాదరావుతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు అనురాగ్ శర్మ, సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌తో పాటు శిక్షణా సంస్థలను మూడేళ్లు కేంద్రం అధీనంలో ఉంచాలని తొలుత భావించారు.

ఆ తరువాత ఇవి తెలంగాణకే ఉండిపోగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.  కేంద్ర ప్రతినిధి అనిల్ గోస్వామిని కలసినపుడు ఈ ప్రతిపాదనను ఐపీఎస్ అధికారులు వ్యతిరేకించడంతో  ఈ రెండు విభాగాలు రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి. ఈ విభాగాలను ఉమ్మడిగా ఉంచితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అధికారులు ఇతర విభాగాల లాగే గ్రేహౌండ్స్‌ను విడగొట్టాల్సిందేనని రాయ్‌కు వివరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం,శ్రీకాకుళంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో తెలంగాణ గ్రేహౌండ్స్ కార్యాలయం హైదరాబాద్‌లో కొనసాగించినా... సీమాంధ్రకు విశాఖపట్నంలో సెంటర్ ఏర్పాటు చేయాలని  ప్రతిపాదించారు. మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు.

1.శిక్షణ  సంస్థను ఏడాదిపాటు ఉమ్మడిగా కొనసాగించాలని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాల ఆధారంగా కేటాయింపులు జరపాలని రాయ్‌ను కోరారు.

2.రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గ్రేహౌండ్స్ విభాగం ఉంటేనే కేంద్రం నుంచి అదనపు నిధులు పొందడానికి వీలవుతుందని ఉన్నతాధికారుల వాదన.

3.ఈ విభాగంలో ఉన్న 2,600 మంది సిబ్బందిని 58.37 : 41.63 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని స్పష్టం చేశారు.

4.అవసరాన్ని బట్టి అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని డెప్యుటేషన్‌పై మరో  రాష్ట్రానికి తీసుకోవచ్చని సూచించారు.
 
 

మరిన్ని వార్తలు