గ్రీవెన్స్.. నో రెస్పాన్స్...!

15 Dec, 2014 02:33 IST|Sakshi

మచిలీపట్నం : ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ప్రహసనంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణికి వచ్చే అర్జీదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రజావాణికి వచ్చిన అర్జీలను ఆయా శాఖలకు పంపుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజావాణికి కలెక్టర్ హాజరైతేనే జిల్లాస్థాయి అధికారులు వస్తున్నారు. లేకుంటే కిందిస్థాయి అధికారులను పంపుతున్నారు.
 
దీర్ఘకాల సమస్యలు వెనక్కే...

దీర్ఘకాల సమస్యలపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చేందుకు వచ్చేవారిని ముందుగానే గుర్తించి లోపలకు రాకుండా వెనక్కి పంపే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 12వ తేదీల మధ్య ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని జన్మభూమి, హుద్‌హుద్ తుపాను తదితర కారణాలను చూపి వాయిదా వేశారు.
 
కిందిస్థాయికి బదిలీ...
గత ఆరునెలల్లో ప్రజావాణికి 5,385 అర్జీలు రాగా వాటిలో 2,228 పరిష్కరించినట్లు చూపారు. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించడంలేదని అర్జీదారులు వచ్చి ఇక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు ఈ సమస్యలను కిందిస్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నారు.

ఇదే అదనుగా భావించిన మండలస్థాయి అధికారులు ఈ సమస్యను పరిష్కరించినట్లు ప్రజావాణి ఆన్‌లైన్‌లో చూపుతున్నారు. మళ్లీ ఇదే సమస్యపై అర్జీ ఇస్తే తిరిగి అదేసమాధానం ఆన్‌లైన్‌లో ఉంచడం గమనార్హం. ఇది చక్రంలా తిరుగుతూనే ఉంది. సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి.  5,385 దరఖాస్తులో పరిష్కరించినవిపోను 30 అర్జీలకు మధ్యంతర సమాచారం ఇచ్చామని, 64 తిరస్కరించామని 2,979 పరిశీలనలో ఉన్నాయని చూపారు.

మరిన్ని వార్తలు