కాబోయే వరుడు అదృశ్యం

25 Sep, 2017 08:13 IST|Sakshi
వినోద్‌ కుమార్‌

ఆందోళనలో వధువు కుటుంబం

పోలీసులకు వరుని తల్లిదండ్రుల ఫిర్యాదు

పలమనేరు : మరో మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికొడుకు అదృశ్యమయ్యాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. పలమనేరు సిల్క్‌ఫామ్‌లో నివాసముంటున్న సిద్దప్ప కుమారుడు వినోద్‌కుమార్‌కు కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రికి చెందిన పెద్దగంగన్న కుమార్తె నవేణితో వివాహం నిశ్చయమైంది. వీరికి ఈ నెల 29న వధువు స్వగృహంలో పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల వారు లగ్నపత్రికలు కూడా పంచారు. పెళ్లి పనులు పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం వినోద్‌ కనిపించకుండా పోయాడు.

దీంతో అతని కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తె గ్రామం, ఇతర బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేదు. అతని సెల్‌ఫోన్‌ సైతం పనిచేయడంలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పలమనేరు చేరుకున్నారు. పెళ్లికొడుకు అదృశ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకోవడంతోనే పెళ్లికి అంగీకరించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వినోద్‌ ఎందుకు కనిపించకుండా పోయాడో అర్థం కావడం లేదని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు