కరువు తీరా వర్షధార

15 Nov, 2019 05:30 IST|Sakshi

సెప్టెంబర్, అక్టోబర్‌లో అనంతపురం జిల్లాను ముంచెత్తిన వర్షాలు

నిండిన చెరువులు, కుంటలు

భారీగా పెరిగిన భూగర్భ జలాలు

వేల సంఖ్యలో రీచార్జ్‌ అయిన బోర్లు

ఆనందంలో ‘అనంత’ జిల్లా రైతాంగం

అనంతపురం అగ్రికల్చర్‌ : అనంతపురం జిల్లా రైతులను ఈసారి వరుణుడు కరుణించాడు. కీలకమైన ఖరీఫ్‌లో ముఖం చాటేసినా.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కరుణించాడు. ఫలితంగా జిల్లాలోనే పెద్దదైన శింగనమల చెరువుకు భారీగా నీరు చేరింది. ఇక 15 ఏళ్లుగా ఎండిపోయిన కంబదూరు చెరువు జలకళను సంతరించుకుంది. పరిగి, నార్పల, గుమ్మఘట్ట చెరువుల్లోకి నీరు చేరగా సమీప ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. నిజానికి నైరుతి రుతుపవనాలు జూన్‌ 22న జిల్లాలోకి ప్రవేశించినా.. అనుకున్న మేర వర్షాలు కురవలేదు. గతేడాది కూడా 552.3 మి.మీ గానూ సాధారణం కన్నా 40.6 శాతం తక్కువగా 327 మి.మీ వర్షపాతం నమోదైంది.

వందేళ్ల చరిత్ర తీసుకుంటే.. 40 శాతం లోటు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోయాయి. జిల్లాలోని 63 మండలాల్లో 50కి పైగా మండలాలు డేంజర్‌ జోన్‌లోకి చేరాయి. మే నెలలో భూగర్భ జలమట్టం సగటున 25.96 మీటర్లకు పడిపోయింది. ఆగస్టు 14 నాటికి అది 27.75 మీటర్లకు క్షీణించడంతో సమస్య జఠిలంగా మారింది. ఇది జిల్లా చరిత్రలోనే అత్యంత కనిష్టస్థాయి. 2.45 లక్షల బోరుబావుల్లో కేవలం 1.20 లక్షలు మాత్రమే పనిచేశాయి. ఖరీఫ్‌లో వేసిన 6.10 లక్షల హెక్టార్ల వర్షాధార పంటలు, 2 లక్షల హెక్టార్లలో విస్తరించిన ఉద్యాన తోటలు, 40 వేల ఎకరాల్లో ఉన్న మల్బరీ తోటలు, 10 లక్షల సంఖ్యలో ఉన్న పశుసంపద, 48 లక్షల సంఖ్యలో ఉన్న జీవసంపద మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది.

రెండు నెలల్లో 352 మి.మీ వర్షం
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వరుణుడు విశ్వరూపం చూపించాడు. ఆగస్టు 16 నుంచి వర్షించడం ప్రారంభించాడు. సెప్టెంబర్, అక్టోబర్‌ నాటికి ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అంతటా భారీగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రెండు నెలల్లోనే రికార్డుస్థాయిలో 352.7 మి.మీ భారీ సగటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండిపోవడంతో ‘అనంత’కు ఒక్కసారిగా జలకళ వచ్చింది.

భూమిలో ఇంకిన 56 టీఎంసీలు
భారీ వర్షాలతో సెప్టెంబర్‌లో సాధారణం కన్నా 65 శాతం, అక్టోబర్‌లో 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రెండు నెలల వ్యవధిలో కురిసిన 352.7 మి.మీ వర్షానికి కుంటలు, వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి. పెద్దపెద్ద చెరువులు సైతం నిండిపోయాయి. దశాబ్దాలుగా నీటి చుక్క పారని నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో కళకళలాడాయి. వర్షాధార పంటలు, పాడి, పట్టు, పండ్లతోటలకు ఉపశమనం కలిగింది. 2 నెలల వర్షాలకు 56 టీఎంసీల వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకినట్లు భూగర్భ జలశాఖ నివేదిక చెబుతోంది. జిల్లాలో ఉన్న బోరుబావులకు 50 టీఎంసీల నీళ్లు అవసరం కాగా ఇప్పుడు ఆరు టీఎంల నీళ్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 70 వేల బోర్లు పూర్తిస్థాయిలో రీచార్జ్‌ అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.

నాడు
అనంతపురం జిల్లాను కరువు మేఘాలు కమ్మే శాయి.. ఏటా గంపెడంత ఆశతో వేసే గింజ మొలకెత్తి మూడ్రోజులే మురిపించేది. పదిమందికి అన్నం పెట్టే అన్నదాత చివరికి ఊరుకాని ఊరిలో పరాయి పంచన చేరి కడుపు నింపుకునేవాడు. గ్రాసం, నీరు లేక పశువులూ కటకటలాడేవి. ఇలా, ఒక్కో ఇంట్లో ఒక్కో కన్నీటి వ్యథ కనిపించేది.. వినిపించేది.

నేడు
కరువు నేలను వరుణుడు ముద్దాడాడు. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కరువుతీరా వర్షించి పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. చెరువులు, కుంటలు నింపేశాడు. భూగర్భ జలమట్టం భారీగా పెంచాడు. నిలువునా ఎండుతున్న లక్షల హెక్టార్ల పండ్ల తోటలు పచ్చటి కళ సంతరించుకున్నాయి. తాగు, సాగునీటి సమస్య దాదాపు లేనట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ‘అనంత’ రూపురేఖలే మారిపోయాయి.

►2018లో లోటు వర్షపాతం 40 %
►ఆగస్టు 14న భూగర్భ నీటిమట్టం27.75మీటర్లు (అత్యంత కనిష్టం)
►సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షపాతం352.7మి.మీ (రికార్డు స్థాయి)
►నవంబర్‌లో భూగర్భ నీటిమట్టం19.70మీటర్లు
►భూమిలోకి ఇంకిన నీరు56 టీఎంసీలు►రీచార్జ్‌ అయిన బోర్ల సంఖ్య70 వేలు

మరిన్ని వార్తలు