వాల్టా.. ఇక్కడ ఉల్టా

25 Apr, 2016 03:53 IST|Sakshi
వాల్టా.. ఇక్కడ ఉల్టా

గాజువాక : నగరంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తోసిరాజని సాగుతున్న ఈ వ్యాపారం పట్ల సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే నగరానికి నీటి లభ్యత తగ్గిపోయి జనం దాహం కేకలు వేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క వ్యాపారులు సబ్ మెర్సిబుల్ పంపులతో భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నగరంలో వేల బోర్లు పనిచేయకుండా మూలకు చేరిపోయాయి.

ఇంకోపక్క ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ పేరుతో మరికొంతమంది వ్యాపారులు, సర్వీసింగ్ సెంటర్ల పేరుతో మరికొంతమంది భూ గర్భ జలాలను హరించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టాలను అమలు చేసి జల సంరక్షణకు నడుం బిగించాల్సిన యంత్రాంగం కిమ్మనకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది.

విచ్చలవిడిగా నీటి అమ్మకం...: నగరంలో భూగర్భ జలాలతో విచ్చలవిడి వ్యాపారం సాగుతోంది. ప్రైవేట్ నీటి హ్యాకర్ల సంఖ్య నగరం మొత్తంమీద వందల్లో ఉన్నట్టు చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, అగనంపూడి, ఆటోనగర్, చినగంట్యాడ, మింది రామ్‌నగర్, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులకు నీటి అమ్మకమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఆరు, ఎనిమిది అంగుళాల బోర్లను తవ్వించి భూగర్భ జలాలను సబ్ మెర్సిబుల్ పంపులతో తోడేస్తున్నారు. కొంతమంది రోజుకు 20 వేల కిలో లీటర్ల సామర్థ్యంగల సుమారు 150 ట్యాంకర్ల నీటిని తోడి అమ్మేస్తున్నారు.

దీంతో సంబంధిత ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యక్తిగత బోర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. అర్బన్ ప్రాంతంలో సుమారు 35 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. వాటికి తోడు ఇటీవల కాలంలో మినరల్ వాటర్ పేరుతో వీధికొకటి వెలసిన విషయం తెలిసిందే. ఫర్మ్ రిజిస్ట్రేషన్ విభాగం వద్ద నమోదు చేయించుకొని నెలకొల్పినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని పలు సందర్భాల్లో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి.

వాల్టా చట్టం ప్రకారం...: వాల్టా చట్టం ప్రకారం ప్రైైవేట్ నీటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరు. ఎవరైనా నీటి వ్యాపారానికి పాల్పడితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అధికారులకు అన్ని అధికారాలూ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా మూసేయాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి జిల్లాలో ఉన్న పలు మినరల్ వాటర్ ప్లాంట్లను మూయించాలంటూ ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయడానికి కూడా జీవీఎంసీ అధికారులకు తీరిక లేకుండా పోయింది.  నీటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులు హాకర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా