జగన్‌ వద్ద గ్రూప్‌-1 అభ్యర్థుల ఆవేదన

16 Nov, 2017 14:03 IST|Sakshi

సాక్షి, కర్నూలు :  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, టీడీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజుకు చేరుకుంది. ఆళ్లగడ్డ నుంచి ఆయన ఇవాళ ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దచింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌రోడ్‌, కొండాపురం, దొర్నిపాడు మీదుగా యాత్ర కొనసాగుతుంది. భాగ్యనగరంలో వైఎస్‌ జగన్‌...పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రూప్‌-1 అర్హత సాధించిన అభ్యర్థులు...జననేతను కలిశారు. 2011 నుంచి తాము ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పుకు రెండోసారి పరీక్ష నిర్వహించి కూడా అర్హత సాధించిన అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. 30 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పి, ఇప్పటివరకూ న్యాయం చేయలేదన్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళతామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

కాగా అంతకు ముందు వైఎస్‌ జగన్‌ను పెద్ద చింతకుంటలో రైతులు కలిశారు. తమ బాధలను రైతులు ఏకరువు పెట్టారు. రైతుల సమస్యలను సావధానంగా విన్న ఆయన..‘ఈ ఏడాది అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోయారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. మేము అధికారంలోకి వస్తే అన్ని పంటలకు ముందుగానే ధర ప్రకటించి ఆ మేరకు కొంటాం.’ అని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌... దారిపొడవునా ఎదురైన ప్రజలందర్నీ పలకరించుకుంటూ...వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. రైతులు, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని......త్వరలోనే మంచిరోజులొస్తాయని భరోసా కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు