శ్రీభాగ్‌ ఒప్పందం.. రాయలసీమ హక్కు పత్రం

14 Sep, 2019 12:29 IST|Sakshi

సాక్షి, కడప(ప్రొద్దుటూరు) : శ్రీభాగ్‌ ఒప్పందం చిత్తు కాగితం కాదని, రాయలసీమ హక్కు పత్రమని ఏపీ విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి అన్నారు. శ్రీభాగ్‌ ఒప్పందం అమలు చేయాలని కోరుతూ పలు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ పార్కు నుంచి శివాలయం సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు, ప్రజలు ప్లకార్డులు పట్టుకొని రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన  సమావేశంలో  డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందే రాయలసీమ, కోస్తా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర పోరాట యోధులు కలసి శ్రీభాగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. శ్రీభాగ్‌ ఒడంబడిక అనేది చిత్తుకాగితం కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. నాటి బ్రిటీష్‌ పాలకులు రాయలసీమ ప్రాంతం కోసం సిద్ధేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. దానిని తుంగలో తొక్కి నాగార్జున సాగర్‌ను నిర్మంచడంతో రాయలసీమకు నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయన్నారు.

గత ప్రభుత్వాలు రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇక్కడి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాయలసీమలో హైకోర్టు లేదా రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. ఇవేవి ఏర్పాటు చేయని పక్షంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం రాయలసీమ వాసులు పోరాటం చేయాల్సిన ఆవశ్యకత వస్తుందన్నారు. బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు మార్తల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం చాలా కాలం నుంచి వెనుకబడి అభివృద్ధి నిరోధకంగా తయారైందన్నారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా రాయలసీమ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని, హైకోర్టు, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లిందన్నారు. శ్రీభాగ్‌ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు పరచి రాజధాని గానీ, హైకోర్టు గానీ రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌ కన్వీనర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అనే ఒక ప్రాంతముందని, అక్కడ మనుషులున్నారనే విషయాన్ని గత ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. ఈ కారణంగానే రాయలసీమ వాసుల గళం వినిపించకుండా చేసిందన్నారు.

సీబీఐటీ చైర్మన్‌ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదన్నారు. నీళ్లతో పాటు నిధులు, పరిశ్రమలు, కేంద్రప్రభుత్వ సంస్థలు ఏ ఒక్కటి లేవని చెప్పారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు లేదా రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నాయకులందరూ మిగులు జలాలను ఇస్తామని చెబుతున్నారని, మాకు మిగులు కాదు.. నికర జలాలు కావాలని జయచంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నరసింహారెడ్డి, ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లేటిప్రభాకర్‌రెడ్డి, రాయలసీమ రాష్ట్రసమితి అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి, న్యాయవాదులు ఈవీసుధాకర్‌రెడ్డి, జింకావిజయలక్ష్మి, సీవీసురేష్, నిర్మలాదేవి, రాఘవరెడ్డి, జింకాసుబ్రమణ్యం, మునిరెడ్డి, పద్మావతి, పెద్ద ఎత్తున విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా