గుంటూరు ఘటన మేల్కొల్పేనా..?

23 Sep, 2017 03:14 IST|Sakshi

వీధికుక్కలతో పొంచి ఉన్న ప్రమాదం

జిల్లాలో ఏటా పెరుగుతున్న కుక్కకాట్లు

స్టెరిలైజేషన్‌ పేరిట పాలకుల దోపిడీ

చిత్తూరు అర్బన్‌ : ఇటీవల జిల్లాలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. కుక్కకాట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలను వీధిలోకి ఒంటరిగా పంపాలంటే హడలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరులో వీధి కుక్కల దాడిలో ప్రేమ్‌కుమార్‌ అనే మూడేళ్ల బాలుడు మృత్యువాత పడటం పాలకులకు గుణపాఠం కావాలి.జిల్లాలోని పట్టణాల్లో 26 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల వరకు శునకాలున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల్ని పెంచుకుంటున్న కొందరు వీటికి అప్పుడప్పుడు యాంటీ రేబిస్‌ టీకాలు వేయిస్తున్నారు. కుక్కల జనాభాలో రేబిస్‌ టీకాలు వేస్తున్న కుక్కల సంఖ్య పది శాతం మాత్రమే. మిగిలిన కుక్కులు వీధుల్లో తిరుగుతూ దొరికిన వాళ్లను దొరికినట్లు కొరుకుతున్నాయి. కుక్కల స్టెరిలైజేషన్‌ చేసినట్టు ఖర్చులకు సంబంధించిన కాగితాల్లో మాత్రమే కనిపిస్తోంది.

ఉన్నా ఉపయోగంలేదు...
జిల్లాలో సగటున ఏటా 30 వేల మంది బాధితులు కుక్కకాట్లకు గురవుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఆస్పత్రులకంటే.. ప్రైవేటు వైద్యం వైపే జనం ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటులో కుక్కకాటుకు వేసే యాంటీ రేబిస్‌ సూది మందు, ఇమ్యునోగ్లోబ్‌ ఇంజెక్షన్‌ ఒక్కొక్కటి రూ.3 వేలు ఉన్నా బాధితులు అక్కడికే వెళుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది మందులు అందుబాటులో ఉన్నా సక్రమంగా వినియోగించకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలోని 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమృద్ధిగా కుక్కకాట్లకు సూది మందులు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల సిబ్బందిలో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఒక్కో యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ వైలిన్‌ ఓపెన్‌ చేస్తే పది మందికి వేయాలి. ఒక్కరికి వేసినా 24 గంటల్లో మిగిలిన మందును పడేయాలి. జిల్లాలోని పలుచోట్ల ఒక్కరికోసం వైలిన్‌ ఎలా వేయగలమంటూ బాధితుల్ని వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు పంపేస్తున్నారు.

కాసులు కురిపిస్తున్న స్టెరిలైజేషన్‌
వీధి కుక్కల నిర్మూలనకు గతంలో కుక్కల్ని పట్టి చంపేసేవారు. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యతిరేకత రావడంతో కుక్కల్ని చంపడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కుక్కల జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స ఒక్కటే మార్గంగా నిలిచింది. ఇదే పాలకులకు, అధికారులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో వీధి కుక్కలకు శస్త్ర చికిత్స చేయడానికి ఆయా మునిసిపల్‌ కమిషనర్లు తిరుపతిలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు పనులు అప్పగించారు. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసి, యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ వేయడానికి రూ.450 చొప్పున స్వచ్ఛంద సేవా సంస్థ వసూలు చేస్తోంది. మునిసిపాలిటీల్లో ఏటా రూ.50 లక్షలకు పైగా కుక్కల స్టెరిలైజేషన్‌కు బిల్లులు చెల్లిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ యథేచ్ఛగా నిధులను బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా