కరువు సీమలో సిరులు

5 Jul, 2020 04:24 IST|Sakshi

డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌తో పేదల జీవితాల్లో వెలుగులు

2007–08, 2008–09 సంవత్సరాల్లో 2.90 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి

కళకళలాడుతున్న అసైన్డ్‌ భూములు

రాయలసీమ జిల్లాల నుంచి పెరుగుతున్న పండ్ల ఎగుమతులు 

రాయలసీమలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్‌ భూముల పంపిణీ చేపట్టారు. అదే వేలాది పేద కుటుంబాల జీవితాలను ఊహించని మలుపుతిప్పింది. 

ఈ రైతు పేరు వెంకట్రాముడు. కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలం కాలువ గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయ కూలీగా జీవించేవాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 4.49 ఎకరాల అసైన్డ్‌ భూమిని వెంకట్రాముడుకు అందించి.. డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ స్కీమ్‌ కింద మామిడి మొక్కలు నాటించారు. దీంతో వెంకట్రాముడు ఉపాధి హామీ పథకం కింద సమీపంలోని వాగు నుంచి బిందెలతో నీటిని తెచ్చి చెట్లకు పోసేవాడు. ఇలా చేసినందుకు అతడికి మూడేళ్లలో రూ.1.10 లక్షలను అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడా మామిడి తోట వెంకట్రాముడుకు ఏటా రూ.3 లక్షల వరకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తోంది. గడచిన ఐదేళ్లలో రూ.15 లక్షల వరకు ఆదాయం లభించిందని, తానిప్పుడు దర్జాగా బతుకుతున్నానని వెంకట్రాముడు చెబుతున్నాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన భూ పంపిణీ, డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ పథకాల వల్ల తనలాంటి బడుగు జీవులెందరో బాగుపడ్డారని ఆనందంగా చెబుతున్నాడు. 

కర్నూలు (అగ్రికల్చర్‌): సహజ వనరులు క్షీణించడం.. ప్రకృతి వైపరీత్యాల వల్ల సరైన దిగుబడులు రాక 2004 సంవత్సరానికి ముందు రాయలసీమ ప్రాంత రైతులు కూలీలుగా మారారు. మరోవైపు జీవనోపాధి లేక నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇతర కారణాల వల్ల కరువు తాండవించింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాలు అనేక సామాజిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయాన్ని పండగ చేయాలనే సంకల్పంతో ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్‌ భూముల పంపిణీ చేపట్టారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను ఇది ఊహించని మలుపుతిప్పింది.  భూములను ఉపాధి  నిధులతో చదును చేసి 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయడంతోపాటు పేద కుటుంబాలకు ఆర్థిక సుస్థిరత కల్పించారు. డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ కింద కర్నూలు జిల్లా ఓర్వకల్, బేతంచెర్ల మండలాల్లో చేపట్టిన పండ్ల తోటలపై కథనం.. 

2.90 లక్షల ఎకరాల్లోపండ్ల తోటల అభివృద్ధి 
2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2.90 లక్షల ఎకరాల పండ్ల తోటలు వేయించారు.  రాయలసీమ జిల్లాల్లోనే 2007–08, 2008–09 సంవత్సరాల్లో 50వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. మామిడి, జామ, చీనీ, నిమ్మ, దానిమ్మ వంటి తోటలతో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు కళకళలాడుతున్నాయి. ఆ రెండేళ్లలో ఉపాధి నిధులతో పండ్ల తోటలకు చేసిన పాదులు నేడు రైతుల్లో నేడు భరోసా నింపుతున్నాయి. ఐదారేళ్లుగా పండ్ల తోటలు అధిక దిగుబడులనిస్తూ రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఎకరం తోటలో ఏడాదికి సగటున రూ.లక్ష వరకు సుస్థిర ఆదాయం వస్తోంది. 
 రైతు హుస్సేన్‌బీ నిమ్మతోటను పరిశీలిస్తున్న ఉపాధి అధికారులు   

ఏటా 5 వేల టన్నుల పండ్లు విదేశాలకు ఎగుమతి
► సాధారణంగా పండ్ల తోటల పెంపకాన్ని నీటి వసతి ఉన్న భూముల్లోనే చేపడతారు. కానీ.. నీటి వసతి లేని రాయలసీమ రైతులు సమీపంలోని వంకలు, వాగులు, కుంటల నుంచి పండ్ల తోటలకు మూడేళ్ల పాటు బిందెలతో నీళ్లు తెచ్చి తడులు ఇచ్చారు.  
► నీళ్లు మోసుకున్నందుకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు చెల్లించారు. రైతుల మూడేళ్ల కష్టం ఫలించింది. పండ్ల మొక్కలు చెట్లుగా అభివృద్ధి చెంది రైతులను కరువు నుంచి దూరం చేశాయి. 
► అనంతరం 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించి పండ్ల తోటలను శాశ్వతం చేశారు. 
► దీంతో రాయలసీమ జిల్లాలు పండ్ల తోటలకు హబ్‌గా అభివృద్ధి చెందాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో యాపిల్‌ తప్ప అన్నిరకాల పండ్లు ఉత్పత్తి కావడం మొదలైంది. 
► ఇక్కడి రైతులు పండిస్తున్న మామిడి, చీనీ, దానిమ్మ తదితర పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే పండ్ల తోటల అభివృద్ధికి వైఎస్సార్‌ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమైందని చెబుతున్నారు. 
► రాయలసీమ జిల్లాల నుంచి ఐదారేళ్లుగా ఏటా 5 వేల టన్నుల వరకు వివిధ రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

వైఎస్‌ తనయుడిగా.. 
► రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం కొరవడింది. గత టీడీపీ ప్రభుత్వం ఉద్యాన పంటలను పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోయారు.  
► 2007–08, 2008–09 సంవత్సరాల్లో కేవలం రాయలసీమ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందితే 2014 నుంచి 2018 వరకు 10 వేల ఎకరాల్లో కూడా తోటలు వేసిన దాఖలాలు లేవు.  
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో రాజశేఖరరెడ్డి తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరిగి పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాలో 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేశారు. వర్షాలు పడుతున్న తరుణంలో గుంతలు తవ్వుకునే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మా జీవితంలో వెలుగులు నింపారు 
మాకు సెంటు భూమి కూడా లేదు. కూలీ పనులు చేసుకునేవాళ్లం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భూ పంపిణీ కింద ఎకరం భూమి ఇచ్చారు. 2007లో ఉపాధి హామీ పథకం కింద డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ కోసం భూమిని అభివృద్ధి చేసే పనులు చేయించారు. దీంతో ఆ భూమిలో 110 నిమ్మ మొక్కలు నాటుకున్నాం. వాటిని బతికించినందుకు ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలై ఆదాయం వస్తోంది. ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.2 లక్షల నికరాదాయం లభిస్తోంది. మా జీవితంలో వెలుగులు నింపిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది.     
– హుసేన్‌బీ,పాలకొలను, ఓర్వకల్లు మండలం

చీనీ తోటలో రైతు ఇ.మద్దయ్య
అయిష్టంగా నాటిన మొక్కలే ఆదుకుంటున్నాయి 
ప్రభుత్వ అధికారులు చెప్పారని అప్పట్లో అయిష్టంగానే 1.85 ఎకరాల్లో చీనీ మొక్కలు నాటాం. మొక్కలు పెరిగే కొద్దీ మాలో పట్టుదల పెరిగింది. మొక్కలు బాగా పెరిగాయి. నాటిన ఐదేళ్ల నుంచి పంట రావడం మొదలైంది. ఏటా రెండు పంటలు పండుతున్నాయి. ఒక్కో పంటపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నాడు వైఎస్‌ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మా గ్రామంలో 150 ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. డ్రైల్యాండ్‌ హార్టీకల్చర్‌ మమ్మల్ని ఇంతలా ఆదుకుంటుందని ఊహించలేదు. మా ఊళ్లో కరవు పోయింది. 
– ఇ.మద్దయ్య, బైనపల్లి, బేతంచెర్ల మండలం 

మరిన్ని వార్తలు