జ్వరం.. భయం

24 Jul, 2015 03:45 IST|Sakshi
జ్వరం.. భయం

- ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు
- రోజూ వందల సంఖ్యలో జ్వర పీడితులు
- 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు
- రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారం
- చేతులెత్తేసిన పట్టణ ఆరోగ్య శాఖ
- వర్షం వస్తే పరిస్థితి మరింత దయనీయం
- ఆందోళన చెందుతున్న వైద్యులు
ప్రొద్దుటూరు క్రైం :
ప్రొద్దుటూరులో ఏ వీధిలో చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. రెండు వారాల నుంచి పడి ఉన్న వ్యర్థాలు విపరీతమైన దుర్గాంధాన్ని వెదజల్లుతున్నాయి. మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చాలా చోట్ల వీధుల్లో మురికి నీరు ప్రవహిస్తోంది. జనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టగానే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే ఇంటికో రోగి ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు తీవ్రంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పట్టణంలో వీధులన్నీ మురికి మయం కావడంతో డయేరియా, మలేరియా జ్వరాలు కూడా తీవ్రతరమవుతున్నాయి.

పది రోజుల క్రితం వరకూ జిల్లా ప్రభుత్వాసుపత్రికి సాధారణ కేసులు మాత్రమే వచ్చేవి. జలుబు, స్త్రీల వ్యాధులు, వృద్ధుల కేసులు, ఒళ్లు నొప్పులు లాంటి వ్యాధులతో ప్రజలు ఆస్పత్రికి వచ్చేవారు. ప్రతి రోజూ 400 దాకా ఓపీ ఉండేది. వారం రోజులుగా ఓపీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ 600 మంది ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో మలేరియా జ్వరాలతో సుమారు 100 మందికి పైగా వస్తున్నారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నాలుగైదు రోజుల నుంచి ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో 20-25 మంది దాకా ఉంటున్నారు. మిగతా వారందరూ వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రికి వస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందడం వల్లే జ్వరాలు అధికమవుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారితో ల్యాబ్‌లు కిక్కిరిశాయి.
 
పలువురికి డెంగీ అనుమానిత జ్వరాలు
పట్టణంలో ఐదారు రోజులుగా డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో కూడా నాలుగు రోజుల నుంచి ప్రతి రోజూ ఒకటి, రెండు కేసులు డెంగీ అనుమానిత కేసులు వస్తున్నట్లు వైద్యులు చెప్పారు. రెండు రోజుల క్రితం రెడ్డిగారి వీధికి చెందిన ఆరేళ్ల బాలిక ప్లేట్‌లెట్ కౌంట్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరింది. జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలికకు ప్లేట్‌లెట్స్ తగ్గడంతో రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. డీసీఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న బాషా అనే 23 ఏళ్ల యువకుడికి డెంగీ లక్షణాలు క న్పించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఐదారు రోజుల్లో సుమారు 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యుల సమాచారం. డెంగీ లక్షణాలున్న వారు కర్నూలు, తిరుపతిలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
 
ఇలాగే ఉంటే పరిస్థితి ప్రమాదకరం
ఇప్పటికే కమలాపురం, కడప, పోరుమామిళ్ల, రాయచోటి, కొండాపురం ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దీనికి తోడు వర్షం వస్తే మాత్రం దోమల సమస్య తీవ్రతరమవుతుంది. అదే జరిగితే డెంగీ కేసులు మరిన్ని నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. జ్వరమొస్తే సొంత వైద్యం మాని ఆస్పత్రికి రావాలి’ అని పట్టణంలోని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు