కోలుకుంటున్న విద్యార్థినులు

15 Mar, 2018 09:02 IST|Sakshi

ప్రభుత్వాస్పత్రి నుంచి కలుషిత ఆహార బాధితుల్లో 9 మంది డిశ్చార్జి

కొత్తగా చేరిన మరో నలుగురు విద్యార్థినులు

లబ్బీపేట (విజయవాడ తూర్పు) : నిల్వ ఉన్న ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు, ఆంధ్రా హాస్పటల్స్‌లో 18 మంది చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రాంగణంలోని కంచికచర్ల గురుకుల రెసిడెన్షియల్‌ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు నిల్వ ఉన్న ఆహారం తిని ఈ నెల 12న వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన విషయం తెలిసింది. వారిలో 12 మందిని ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్‌ చేయగా, 18 మందిని ఆంధ్రా హాస్పటల్‌కు తరలించారు.

కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 9మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. అయితే, అదే హాస్టల్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో కొత్తగా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు డెప్యూటీ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జె నరసింహనాయక్‌ తెలిపారు. కాగా ఆంధ్రా హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న 18 మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పాతూరి వెంకట రామారావు తెలిపారు. అందరినీ గురువారం డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బుధవారం పలు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు పరామర్శించారు. కాగా ఈ ఘటనకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..
మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : తమ కుమార్తెలను ఎంతో నమ్మకంతో ఇక్కడ ఉంచి వెళితే మీరు ఈ విధంగా ఆసుపత్రి పాలు చేస్తారా.. అంటూ ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు బుధవారం కంచికచర్ల సోషల్‌ వెల్ఫేర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సుబ్రహ్మణ్యంను నిలదీశారు. మాచవరంలోని హాస్టల్‌లో వారు ప్రిన్సిపల్‌ను కలిసి ఫుడ్‌ పాయిజనింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ కుమార్తెలను ఇళ్ళకు తీసుకువెళ్ళిపోయారు. అలాగే, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. మహేష్, ఏ అశోక్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ కోటి, ఎం సోమేశ్వరరావు, నగర కార్యదర్శి సుమంత్, ఉపాధ్యక్షుడు యేసుబాబు తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రిన్సిపల్‌ సుబ్రహ్మణ్యంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, మంగళవారం నుంచి ప్రారంభించిన ప్రత్యేక వైద్య శిబిరం బుధవారం కూడా కొనసాగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వైద్య సిబ్బంది   అవసరమైన సేవలు అందించారు. 

మరిన్ని వార్తలు