మార్చి 15కు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 వాయిదా

6 Feb, 2018 04:13 IST|Sakshi
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 రాకెట్‌ రెండో దశను అనుసంధానం చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

అదే నెలలో రెండు ప్రయోగాలు

ఏప్రిల్‌ రెండో వారంలో చంద్రయాన్‌–2?

శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’నుంచి ఈ నెల 26న ప్రయోగించ తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 ప్రయోగం మార్చి 15వ తేదీకి వాయిదా పడింది. మార్చి 15న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08, 22న పీఎస్‌ఎల్‌వీ సీ41 ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 రాకెట్‌ ద్వారా జీశాట్‌–6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. అయితే, ఉపగ్రహం రావడం ఆలస్యం కావడంతో ఈ నెల 26న చేయాలనుకున్న ప్రయోగం మార్చికి వాయిదా పడింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ రెండో దశ అనుసంధానం పనులు సోమవారం చేపట్టారు.  

12 నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 క్యాంపెయిన్‌ పనులు
మరోవైపు.. ఈ నెల 12న మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 రాకెట్‌ క్యాంపెయిన్‌ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇదిలా ఉండగా మార్చి 10న వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌) నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 రాకెట్‌ను ఊంబ్లికల్‌ టవర్‌ మీదకు తరలించిన వెంటనే వ్యాబ్‌లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 రాకెట్‌ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్‌ ద్వారానే చంద్రయాన్‌–2 ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే ఏప్రిల్‌ రెండో వారంలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

మరిన్ని వార్తలు