జీఎస్టీ  నిధులు విడుదల చేయాలి

4 Feb, 2020 04:43 IST|Sakshi

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత

సాక్షి, న్యూఢిల్లీ/కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జీఎస్‌టీ నిధులను వెంటనే విడుదల చేయాలని తూర్పు గోదావరి జిల్లా  కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడుతూ జీఎస్టీ అమలులో వివిధ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ‘2017లో జీఎస్టీ అమలు చేసినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు తమ వద్ద ఆర్థిక వనరులు లేవని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు 2019 అక్టోబర్, నవంబర్‌లలో రూ.682 కోట్ల మేర ఆదాయం తగ్గింది. కానీ కేంద్రం నష్టపరిహారం ఇవ్వలేదు. డిసెంబరు నుంచి జనవరికి సంబంధించి ఇంకా లెక్కించలేదు. ఏప్రిల్‌ 2019 నుంచి నవంబరు 2019 వరకు రూ. 2,136 కోట్ల మేర తక్కువ ఆదాయం వచ్చింది. కానీ కేంద్రం పరిహారంగా రూ. 1,454 కోట్లు మాత్రమే ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎస్జీఎస్టీ ఎంత ఇవ్వాల్సి ఉంది? ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పుడు ఆశించవచ్చు?..’ అని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సమాధానమిస్తూ ఇప్పటివరకు ఎంత పరిహారం ఇవ్వాల్సి ఉందో అంతా ఇచ్చేస్తామని చెప్పారు. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ మరో ఉప ప్రశ్న సంధిస్తూ ‘జీఎస్టీ నెట్‌వర్క్‌ సమస్యలు పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అలాగే అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘం జీవిత బీమా పాలసీ ప్రీమియం నుంచి జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్‌పై కేంద్రం ఎలాంటి చర్య తీసుకుంది..’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ జీవిత బీమా పాలసీల విషయంలో జీఎస్టీ అంశంపై కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

జీఎస్టీ నెట్‌ వర్క్‌కు సంబంధించి సభ్యురాలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్‌ ఇదే అంశంపై ప్రశ్నిస్తూ ‘కేంద్ర ప్రభుత్వం సెస్‌ రూపంలో అనేక పన్నులు వసూలు చేస్తోంది. ఈ పన్నులను రాష్ట్రాలకు పంపిణీ చేస్తోందా లేదా?’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ సెస్‌ ద్వారా వసూలు చేస్తున్న మొత్తాన్ని రాష్ట్రాలకు పంచుతున్నామని చెప్పారు.

వెనబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వని కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏడు జిల్లాలకు ఏటా రూ. 350 కోట్లు ఇస్తుండగా 2017–18, 2018–19కి ఇవ్వలేదని, 2019–20కి సం బంధించి వాస్తవ స్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తెలంగాణకు మూడో విడత, నాలుగో విడత కలిపి ఇప్పటివరకు ఏటా రూ. 450 కోట్ల చొప్పున ఇచ్చామని, ఇది నీతిఆయోగ్‌ సిఫారసుల మేరకు ఇచ్చామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తన సమాధానంలో చెప్పారు. నీతి ఆయోగ్‌ సిఫారసులకు అనుగుణంగా ఏపీకి రూ.350 కోట్ల చొప్పున 3 విడతలుగా రూ.1050 కోట్లు ఇచ్చామన్నారు. తదుపరి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం రాలేదు.

గొట్టిప్రోలు వర్తక కేంద్రమని పురావస్తు తవ్వకాల్లో వెల్లడైంది
ప్రాచీన చరిత్ర కాలంలో గొట్టిప్రోలు వర్తక కేంద్ర మని భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో వెల్లడైందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు మాగుంట, బెల్లాన, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2018–19లో తవ్వకాలు జరపగా ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు లభించాయని, ఇటుక నిర్మాణం, మహా విష్ణు విగ్రహం, టెర్రకోట బొమ్మలు, రాగి నాణేలు లభ్యమైనట్టు వివరించారు. 

జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఏపీకి రూ. 372 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఏపీకి రూ.372.64 కోట్లు కేటాయించామని, ఇందులో రూ. 151.73 కోట్లు ఇప్పటికే మొదటి విడతగా విడుదల చేశామని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2020 జనవరి 28 నాటి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం నెల్లూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 60.89 శాతం కుటుంబాలకే నల్లా కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. 

మరిన్ని వార్తలు