పన్నుల వసూళ్ల జోరు

2 Jul, 2018 05:04 IST|Sakshi

     రాష్ట్రంలో వృద్ధిచెందుతున్న జీఎస్‌టీ వసూళ్లు

     మొత్తం రూ.22,733 కోట్ల ఆదాయం

     జీఎస్‌టీ అమల్లోకొచ్చి ఏడాది పూర్తి

విశాఖసిటీ: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుచేసిన మొదటి నెలలో తడబడ్డ రాష్ట్రం.. ఏడాది తిరిగేనాటికి వసూళ్లలో వేగం పుంజుకుంది. జూలైలో అన్ని రకాల జీఎస్‌టీలు రూ.9 కోట్లు మాత్రమే వసూలు కాగా.. తర్వాత నెల నుంచి సరాసరి రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. ఓ వైపు.. దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు మందగమనంలో ఉండగా ఏపీలో మాత్రం వృద్ధి చెందుతున్నాయి. 11 నెలల్లో సెంట్రల్‌ జీఎస్‌టీ ఖజానాకు రూ.22,733 కోట్లు చేరాయి. 

క్రమంగా వేగం 
జీఎస్‌టీ అమలుచేసిన తొలి నెలలో వ్యాపారులు, రాష్ట్ర పన్నుల శాఖ మధ్య అవగాహన లేమి, ఇతర కారణాలతో పన్నుల వసూళ్లలో వెనుకబడిన రాష్ట్రం.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. రిటర్న్స్, పన్ను వసూళ్లపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖాధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. రిటర్న్స్‌ దాఖలు చేసే విషయంలో సెంట్రల్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు, కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో గతేడాది ఆగస్ట్‌ నుంచి ఈ ఏడాది మే వరకూ వరుసగా పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2017 జూలై నుంచి 2018 మే నెల వరకు సెంట్రల్‌ ట్యాక్స్‌ (సీజీఎస్‌టీ) రూ.5,330.39 కోట్లు వసూలుకాగా.. ఐజీఎస్‌టీ రూ.7,950.23 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.9,028.52 కోట్లు వసూలైంది. ఈ 11 నెలల కాలంలో కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా విధిస్తున్న సెస్‌ రూ.209.65 కోట్లు వసూలయ్యాయి. జీఎస్‌టీ అమలైన 2017 జూలైలో అన్ని పన్నులు కలిపి రాష్ట్రంలో రూ.9.9 కోట్లు ఆదాయం రాగా..  2018 మే నెలాఖరునాటికి 11 నెలల కాలంలో రూ.22,733.81 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుకున్నాయి. 

రిటర్న్స్‌ ఫైలింగ్‌లోనూ ముందంజ
పన్నుల వసూళ్లలో టాప్‌గేర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. జీఎస్‌టీకి సంబంధించిన రిటర్న్స్‌ ఫైలింగ్‌లోనూ అదే జోరుతో ముందుకెళ్తోంది. దేశ సగటు కంటే ఏపీ సగటు అధికంగా ఉండటం గమనార్హం. కాంపోజిషన్‌ డీలర్లు ఫైల్‌ చేసే జీఎస్‌టీఆర్‌4 రిటర్న్స్‌ దేశవ్యాప్తంగా 70.03శాతం కాగా.. రాష్ట్రంలో ఈ సగటు 74.62 శాతం నమోదైంది. 3బీ రిటర్న్స్‌లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా 67.85 శాతం 3బీ రిటర్న్స్‌ దాఖలు శాతం ఉండగా.. ఏపీలో 66.58 శాతం ఉంది. అంతర్‌రాష్ట్ర పన్నులకు సంబంధించిన ఐజీఎస్‌టీ రీఫండ్‌లోనూ రాష్ట్రం చురుగ్గా వ్యవహరిస్తోంది.

2018 మే నెలాఖరు వరకూ రూ.947.53కోట్ల రీఫండ్‌కు చెందిన 8,282 బిల్లులు సెంట్రల్‌ జీఎస్‌టీ కమిషనరేట్‌ ఏర్పాటు చేసిన కార్యాలయాలకు రాగా.. 5,242 బిల్లులకు సంబంధించిన రూ.812.90 కోట్లు వ్యాపారులకు రీఫండ్‌ ఇచ్చారు. వ్యాపారులకు సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీపై ప్రతి నెలా అవగాహన కల్పిస్తుండటంతో ఈ వృద్ధి సాధ్యమైందని సెంట్రల్‌ జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్‌ సృజన్‌కుమార్‌ చెప్పారు. ఇప్పటికీ పలువురు వ్యాపారులు కొన్ని ఇబ్బందుల కారణంగా రిటర్న్స్‌ దాఖలు చెయ్యడం లేదనీ, త్వరలోనే అన్ని వర్గాల వ్యాపారులూ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు