హోదాతోనే అభివృద్ధి సాధ్యం

11 Oct, 2015 02:02 IST|Sakshi
హోదాతోనే అభివృద్ధి సాధ్యం

ఏపీకి ప్రత్యేక  హోదా సాధించకుంటే ఇబ్బందులు తప్పవని వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు భిన్నమైన ప్రకటనలు చేస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేసిన వారు హోదాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అవి వారి మాటల్లోనే....                        - గుంటూరు వెస్ట్
 
హోదాతో కొత్త పరిశ్రమలు వస్తాయి
ప్రత్యేక హోదా వలన అనేక రకాల రాయితీలు వస్తాయి. తద్వారా కొత్తపరిశ్రమలు ఏర్పడుతాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ గానీ ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. విదేశాలు తిరిగి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నా స్పందనలేదు. విదేశాలు తిరిగి ప్రజాధనం దుర్వినియోగం చేసేకన్నా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి చూడాలి. దాని ద్వార అనేక పరిశ్రమలు, కొత్త కోర్సులు వస్తాయి. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించే కేంద్రాలు వెలుస్తాయి.
- ఎం.సూర్యారావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి  
 
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ప్రత్యేక హోదా వస్తే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. నూతన పరిశ్రమలు వచ్చే సమయంలో, ఆ పరిశ్రమలకు అవసరమైన కోర్సులకు డిమాండ్ ఉంటుంది. విద్యార్థుల నుంచి కూడా నూతన పరిశ్రమలను, కొత్త టెక్నాలజీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో సైతం పరిశోధనలు జరిగి, రాష్ట్ర భవిష్యత్‌కు అవసరమైన కోర్సులు, పరిశోధనలు పెరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేక హోదాతో కొత్తగా నిధులు వస్తాయి కాబట్టి విద్యారంగం నిధుల కొరతతో కునారిల్లుతోంది.  
- వి.భగవాన్‌దాస్, ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి
 
అన్యాయానికి హోదా తోనే పరిష్కారం
ఐదు కోట్ల మంది ఆంధ్రులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసేందుకుకు ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులకు ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌కు విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అండగా నిలవాలి.
- లగుడు గోవిందరావు, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
 
హోదా విషయంలో సీఎం చేతులెత్తేశాడు
చంద్రబాబు 600కు పై చిలుకు వాగ్దానాలు చేశారు. వాటన్నింటిని నెరవేర్చలేక అసమర్థుడుగా నిలబడ్డాడు. విభజన చట్టం అంశాల్లో చంద్రబాబు ఏం సాధించాడో తెలియజేయాలి. కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించడంలో చేతులెత్తేశాడు. జనాగ్రహం చవి చూస్తూనే కళ్ళు మూసుకుని పిల్లి పాలుతాగుతున్నట్లు తాను ఏదో సాధించబోతున్నట్లు చంద్రబాబు కబుర్లు చెబుతున్నాడు. జగన్ దీక్షకు అందరూ మద్దతు పలికి ఉద్యమం ఉధృతం చేసి చంద్రబాబు దిగి వచ్చేలా చేయాలి.
- డేవిడ్ విజయకువూర్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర న్యాయవాదుల కార్యదర్శి
 
చంద్రబాబు కొడుకును ప్రమోట్ చేస్తున్నారు..
చంద్రబాబు ప్రజాధనంతో కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు. సొంత డబ్బులతో చేసుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు ఒప్పుకొని ప్రత్యేక హోదా కోసం  కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేదంటే 22వ తేదీ ప్రజలందరూ మోదీముందు తమ శక్తి ఏమిటో చూపిస్తారు.
- హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ
 
టీడీపీ నేతలు కూడా మద్దతు పలకాలి..
వై.ఎస్.జగన్ వరుస ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజలు అశేషంగా తరలి వచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు. భవిష్యత్తు తరాల కోసం జగన్ చేస్తున్న ఉద్యమాన్ని  ఇప్పటికైనా టీడీపీ ప్రజాప్రతినిధులు మద్దతు పలకాలి.
- మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి సమన్వయకర్త
 
రైతన్న వెన్ను విరిచేస్తున్నారు..
చంద్రబాబు తెలంగాణలో రైతుల రుణమాఫీ చేయాలని కేకలు పెడతారు. ఇక్కడ పది శాతం రుణమాఫీ చేసి మొత్తం చేశామని పచ్చి అబద్ధాలు చెబుతాడు. అతనికి ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు. రైతులు, గిరిజనులు, కార్మికుల దయనీయ స్థితి అంతకన్నా పట్టదు. మాట్లాడితే చైనా, సింగపూర్, జపాన్, జర్మనీ అంటూ పరుగులు తీస్తాడు.

అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ రైతన్న వెన్ను విరిచేస్తున్నాడు. మూడు పంటలు పండే భూమిలో భవనాలు కట్టి తన కోటరికి శాశ్వత ఆస్తులుగా కట్టబెట్టడానికే తన శక్తి అంతా ధార పోస్తున్నాడు. ముక్కలైన మన రాష్ట్రంలో ప్రజలంతా అతన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు. చంద్రబాబు నీ పాలనలో ప్రత్యేక హోదా రానివ్వవా? పైగా ఉద్యమం చేస్తున్న వై.ఎస్.జగన్‌ను విమర్శిస్తావా...నీ చేష్టలకు ప్రజలు విసిగిపోయి తీర్పు చెప్పడానికి ఎదురు చూస్తున్నారు.
- బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
 
జగన్ ఉద్యమం ఎంతో గొప్పది..
జగన్‌కు జైజైలు... ఆయన ఉద్యమ స్ఫూర్తికి దండాలు... యువత భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న పోరాట యోధుడు వై.ఎస్.జగన్. దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ చట్టాలు గొప్పగా అమలు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం జగన్ చేస్తున్న  ఈ ఉద్యమం ఎంతో గొప్పది. ప్రత్యేక హోదా వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి. అందరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి.
- రామావత్ కృష్ణా నాయక్, బంజారా నగరభేరి రాష్ట్ర అధ్యక్షుడు
 
ప్రజా ఘోష వినబడటం లేదా?
యువత కోసం, ప్రజల కోసం అందరూ బాగుండాలని వై.ఎస్.జగన్ దీక్ష చేస్తుంటే ప్రజాప్రతినిధులు అయి ఉండి దొంగ దీక్ష అనడం నీతిబాహ్యం. చంద్రబాబుకు ఈ ప్రజా ఘోష వినబడడం లేదా. ఆయన థ్యాసంతా ఎలా దోచుకోవాలనే దానిమీద ఉంది. విదేశాలకు తిరగడానికి తీరిక ఉంది గానీ, ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి లేదు. టీడీపీ శ్రేణులు ఇసుక, మట్టి, భూములు దోచుకుని పందికొక్కుల్లా తింటున్నారు. వీళ్లను ఎప్పుడు తరిమి కొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బాబు చేసే పాపం అతనికే చుట్టుకుంటుంది.
- కారుమూరి నాగేశ్వరరావు,తణుకు, మాజీ ఎమ్మెల్యే
 
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
ప్రత్యేక హోదా రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. హోదా రాకుంటే రానున్న తరాల భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో మిన్నకుండిపోవడం బాధాకరం. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలి. జగన్ చేస్తున్న దీక్షకు తమ సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము.
- ఎన్.ఝాన్సీ, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు
 
హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి
నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే హోదా ఒక్కటే మార్గం. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితులలో హోదా లభించకుంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. టీడీపీ, బీజేపీలు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. వాటిని ఇంతవరకు నెరవేర్చలేదు. హోదా మాటను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు. ప్యాకేజీలతో పెద్దగా ఉపయోగం ఉండదు.
- ఎ.అయ్యస్వామి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ

>
మరిన్ని వార్తలు