వైఎస్‌ జగన్‌ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారు

30 Jun, 2019 17:50 IST|Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి

సాక్షి,  విశాఖపట్నం : గత నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను తెలుగు ప్రజలు స్వాగతిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి తెలిపారు. ప్రజల నీటి కష్టాలు తీర్చే ప్రయత్నంలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవడం శభపరిణామమని పేర్కొన్నారు. గతంలో రాయలసీమకు నీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్‌  దూరమవడంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ దానిని విస్మరించిందని  విమర్శించారు.

1995 నుంచి 2004 మధ్య ఆలమట్టి డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజల నీటి కష్టాల గురించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా వైఎస్‌ జగన్‌ ఏకైక ఆధారమైన గోదావరి నీటిని శ్రీశైలం తీసుకువెళ్లి రాయలసీమకు అందించాలని యోచిస్తుంటే,  టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతోనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పొరుగు రాష్ట్రాల సీఎంలతో స్నేహ సంబంధ భావంతో మెలుగుతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు