రసాభాసగా గుడ్లూరు సర్వసభ్య సమావేశం

17 Aug, 2015 03:30 IST|Sakshi
రసాభాసగా గుడ్లూరు సర్వసభ్య సమావేశం

- గుడ్లూరు ఎంపీపీని గదిలో నిర్బంధించిన టీడీపీ సభ్యులు
- జెడ్పీటీసీ సభ్యుడిని బయటకు నెట్టిన తెలుగు తమ్ముళ్లు
- వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు రక్షణ కరువు
గుడ్లూరు :
స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. సమావేశం ప్రశాంతంగా ముగుస్తోందనుకుంటున్న సమయంలో టీడీపీ సభ్యులు మండల పరిషత్ నిధులపై చర్చ జరపాలని పట్టుబట్టడంతో వివాదం ప్రారంభమైంది. ఎంపీటీసీలతో చర్చించి నిధులు ఖర్చు పెడదామన్న ఎంపీపీ శ్రీనివాసులును హాలు నుంచి బయటకు రాకుండా టీడీపీ సభ్యులు నిర్బంధించారు. బయటకు వెళ్తున్న జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డిపై దాడికి దిగారు. చొక్కా పట్టుకొని బయటకు లాగారు. ఇటీవల టీడీపీలో చేరిన వైస్ ఎంపీపీ పొట్టేళ్ల మురళి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.18 లక్షలు, జనరల్ ఫండ్ రూ.9 లక్షలు ఖర్చు చేసేందుకు చర్చ జరగాలని కోరడంతో ఎంపీటీసీ సభ్యుల ఆమోదంతో రూ.10 లక్షలు ఖర్చు పెట్టేందుకు ఎంపీపీ అంగీకరించారు.

ఆ నిధులతో మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల వద్ద సీసీ రోడ్లు వేద్దామని టీడీపీ సభ్యులు పట్టుపట్టడంతో ఆ నిధులను గ్రామాల్లో అంతర్గత రోడ్లుకు మాత్రమే ఉపమోగించాలని జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడటంతో వాగ్వాదం మొదలైంది.  జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి సమావేశపు హాలు నుంచి బయటకు వెళ్తుండగా రావూరు సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఆయన్ను హాలు నుంచి బయటకు నెట్టాడు. బయట ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి చొక్కా పట్టుకొని జెడ్పీటీసీని నెట్టడంతో ఒక్క సారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

జెడ్పీటీసీపైదాడి చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్‌లు నక్కల శ్రీనివాసులు, అద్దంకి నరసింహం, సుబ్బారావులు ధ్వజమెత్తారు. అదే సమయంలో ఎంపీపీ శ్రీనివాసులు కూడా సమావేశపు హాలు నుంచి బయటకు వస్తుండగా రావూరు శ్రీనివాసులు, టీడీపీ ఎంపీటీసీ సభ్యులు అడ్డుకొని తలుపులు వేశారు. దీంతో అక్కడ ఏమి జరుగుతుందో అర్థం కాక అధికారులు, సర్పంచ్‌లు భయాందోళనకు గురయ్యారు. అరగంట పాటు ఎంపీపీని, అధికారులను టీడీపీ కార్యకర్తలు లోపలే ఉంచారు. చివరకు ఎంపీడీఓ జోక్యం చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు