మద్యం ధరలు మార్గదర్శకాలు

4 May, 2020 03:42 IST|Sakshi

గతేడాది అధికారంలోకి రాగానే సీఎం 20% దుకాణాలను అంటే 4,380 షాపులను 3,500కు తగ్గించారు.

బెల్టుషాపులను పూర్తిగా తొలగించారు. అంతేకాదు.. మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకొచ్చారు.

లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు అనుమతించడంతో షాపుల వద్ద భౌతిక దూరాన్ని అమలుచేయనున్నారు. మద్యం అమ్మకాల వేళలను నియంత్రించనున్నారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రొహిబిషన్‌ ట్యాక్స్‌తో ధరల పెంపు
► ‘ప్రొహిబిషన్‌ ట్యాక్స్‌’ ద్వారా మద్యం ధరలను పెంచనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది.  
► మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 25 శాతం అదనంగా పెంచుతారు. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్‌ ధర రూ.300 ఉందనుకుంటే 25 శాతం ధర పెంచి రూ.375కి విక్రయిస్తారు. 
► బీరు, దేశీయ, విదేశీ, రెడీ టు డ్రింక్‌ అన్ని వెరైటీలు, అన్ని పరిమాణాల బాటిళ్లకు పెరిగే ధరలు వర్తిస్తాయి. 
► పెంచిన ధరలతోనే సోమవారం నుంచి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
► ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులను తెరవనున్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ వెలుపల మాత్రమే మద్యం షాపులను తెరుస్తారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. 

విక్రయాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు: రజత్‌ భార్గవ
మద్యం విక్రయాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపినట్లు ఎక్సైజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. ‘మద్యం షాపుల వద్ద సోషల్‌ వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటాం. రద్దీ ఎక్కువగా ఉంటే షాపులను కొంతసేపు మూసివేస్తాం. వార్డు వలంటీర్లు విధులు నిర్వహించేలా కలెక్టర్లకు సూచనలు చేశాం. మద్యం షాపుల ఎదుట నిబంధనలు తెలిపే బోర్డులుండాలి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ బయట షాపులు తెరుస్తాం. మాల్స్, బార్లు, క్లబ్‌లు తెరుచుకోవు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు’ అని ఆయన వివరించారు.

మద్యం విక్రయాలపై మార్గదర్శకాలు ఇవీ..
► మద్యం షాపుల్లో శానిటైజర్లు ఉండాలి. ఒకేసారి ఐదుగురికి మించి అనుమతించరు. ఐదుగురు మాత్రమే నిలుచునే విధంగా వృత్తాలు ఏర్పాటు చేస్తారు. రెండు వృత్తాల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండాలి. మాస్కులు ధరించడం తప్పనిసరి.
► మద్యం షాపుల వద్ద పోలీసుల పర్యవేక్షణతోపాటు సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి అదనపు సెక్యూరిటీ గార్డులను నియమించాలి.
► మద్యం షాపుల వద్ద జనం గుమిగూడితే పోలీసులను రప్పించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
► మద్యం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా వార్డు/గ్రామ వలంటీర్లను షాపుల వద్ద ఉంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
► కలెక్టర్లు మద్యం అమ్మకాలపై మీడియా/ఆడియో విజువల్స్‌ ద్వారా తెలియజేయాలి.
► పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన లిక్కర్‌ లైసెన్సులు, బార్లు, క్లబ్‌లను మద్యం విక్రయాలకు అనుమతించరు. 

మద్యం ధరలు 25 శాతం పెంపు
మద్యపానాన్ని నిరుత్సాహపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం తన నివాసంలో జరిగిన సమీక్షలో మద్యం నియంత్రణపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని అధికారులు ప్రస్తావించగా.. మద్యం నియంత్రణ మన విధానమని ఆ దిశగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్యం ధరలను 25% పెంచాలని.. రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు