కరోనా వైరస్‌ నిర్మూలనకు మార్గదర్శకాలు

7 Apr, 2020 03:41 IST|Sakshi

సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీల్లో జాగ్రత్తలు పాటించాలి

జాబితా విడుదల చేసిన కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా వ్యాపార సంస్థలు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ షాపులు తదితర వ్యాపార సంస్థల యజమానులకు కోవిడ్‌–19 రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. అవి..

► స్టోర్‌లో పనిచేసే ఉద్యోగులు తమకు కరోనా వైరస్‌ లేదా ఫ్లూ లాంటి లక్షణాలున్నట్లు అనిపిస్తే విధులకు వెళ్లకూడదు.
► కస్టమర్ల రద్దీని తగ్గించడానికి స్టోర్‌ లోపల వన్‌–వే లూప్‌ను సూచించేలా నేలపై గుర్తులు లేదా ఇతర దృశ్య వ్యవస్థను పాటించాలి.వినియోగదారులు అవసరానికి మించి సరుకులు కొనకూడదని గుర్తుచేయాలి. 
► ఒకవేళ వారు వరుసలో వేచి ఉండాల్సి వస్తే స్టోర్‌ బయటి క్యూలైన్లు ఏర్పాటుచేయాలి.
► పెద్ద దుకాణదారులు తమ కస్టమర్ల ఫోన్‌ నంబర్లను తీసుకుని టోకెన్‌ పద్ధతిని పాటించాలి. వారి నెంబర్‌ వచ్చినప్పుడు సదరు వినియోగదారునికి సమాచారమిస్తే ఆ సమయంలోనే కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
► ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి ప్రాధాన్యతనిచ్చి ఇంటికి డెలివరీ ఇచ్చేలా వినియోగదారులను ప్రోత్సహించాలి.
► స్టోర్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు వీలైతే వినియోగదారులకు కూడా టెంపరేచర్‌ టెస్ట్‌లు చేయాలి. ఒక వ్యక్తి టెంపరేచర్‌ అత్యధికంగా (101ఎఫ్‌) చూపిస్తే వారిని స్టోర్లోకి అనుమతించకూడదు.
► స్టోర్‌లోని సిబ్బంది, కస్టమర్లు పరస్పరం తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లు కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లింగ్‌ చేసే వారు గ్లౌజులు, మాస్క్‌లు ధరించాలి.
► సాధ్యమైనంత వరకు నగదు చెల్లింపులను నివారించి ఆన్‌లైన్‌ ద్వారా లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేయాలి.
► స్టోర్‌లోని అన్ని ప్రదేశాలు, ఉపరితలాలను సిబ్బంది శుభ్రంగా ఉంచాలి. 

మరిన్ని వార్తలు