తొలి అడుగు.. కారాదు తప్పటడుగు

2 Jul, 2019 07:57 IST|Sakshi

భవిత నిర్ణయించేది కళాశాల విద్యే

విద్యార్థులూ... ఆకర్షణ వలలో చిక్కుకుంటే అథోగతే

మంచి దారి ఎంచుకోవాలంటున్నవిద్యావేత్తలు

అన్నప్రాసన చేసే సమయంలో బంగారపు వస్తువు.. పుస్తకం.. కలం.. వస్తువులు ముందుంచి తమ బుజ్జాయి ఏది పట్టుకుంటాడోనని తల్లిదండ్రులు పరీక్షించడం చూస్తుంటాం. ఆరు నెలల పసిబిడ్డ చేసే విన్యాసానికి కుటుంబ సభ్యులు ఒకింత ఊపిరి బిగబట్టి ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. బిడ్డ భవితకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారనేది ఈ తంతుని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చిన్నారి చిట్టిపొట్టి అడుగులు వేసేటప్పుడు కన్నవారు చూసి ఎంతగానో మురిసిపోతారు. కానీ పిల్లలు కళాశాలలో అడుగు పెడుతున్నారంటే తల్లిదండ్రుల్లో ఒకింత ఆందోళన వెంటాడుతోంది. ఎక్కడ పెడదోవ పట్టి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటారోనని.. అథోగతి పాలై తమ పరువును బజారుకీడుస్తోడో అన్న భయం చాలామందిలో కనిపిస్తోంది. కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థులు సెల్‌ఫోన్, మాదకద్రవ్యాలు, ప్రేమ, ఆకర్షణ వలలో చిక్కుకోకుండా కన్నవారికి మంచిపేరు తీసుకొచ్చేలా మంచి భవితకు పునాది వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి వరకు ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటా రు. పది పూర్తిచేసిన తరువాత 60 శాతానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ జూని యర్‌ కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్నారు. ఈ సమయంలో తప్పటడుగు వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెల్‌ఫోన్‌కు సాధ్యమైనంతగా దూరంగా ఉండడం మంచిదని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే కళాశాలకు వెళ్తు న్న విద్యార్థులు స్నేహితుల ప్రభావంతో దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మద్యం, సిగరెట్‌ తాగడానికి అలవాటుపడుతున్నారు. సెల్‌ఫోన్లో అభ్యంతరకర చిత్రాలు చూసి ఉద్రేకానికి గురై నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కొని కటకటాల పాలవుతున్న వారు ఉన్నారు.

భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దురలవాట్లకు లోనైన వారు ఏకాగ్రతతో చదవలేకపోతున్నారు. నగరాల్లో అయితే కొందరు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. క్రికెట్‌ బెట్టింగులకు దిగి అప్పుల పాలవుతున్నారు. చదువు అటకెక్కి నష్టపోతున్నారు. ప రీక్షలు సరిగా రాయలేక మార్కులు బాగా తక్కువగా వస్తున్నాయి. ఉత్తీర్ణులు కాలేక అవమానంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కళాశాలకు అని చెప్పి నదులు, సముద్ర తీరాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. కన్నవారికి తీరని కడువుకోతను మిగుల్చుతున్నారు.

దారి తప్పి ఇలా..
ఇంటర్‌లో 95 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న సూర్యప్రకాశ్‌ ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌లో చేరాడు. సహచరులు పరిచయం కావడంతో తరగతులకు డుమ్మాకొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం ప్రారంభించాడు. జల్సాలకు ఖర్చులు పెరిగిపోయి అప్పులు చేశాడు. అమ్మానాన్నకు తెలిసింది. పిల్ల వాడి అప్పులు తీర్చి దురలవాట్లు మాన్పించడానికి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. నాలుగేళ్లలో పూర్తిచేయాల్సిన ఇంజినీరింగ్‌ ఆరేళ్లకు పూర్తయింది. అరకొర మార్కులే కావడంతో గుమస్తా ఉద్యోగంలో చేరాడు.

మొదట్లో ఇలా..
వినోద్‌కుమార్‌కు పాఠశాలలో తన తోటి విద్యార్థి అయిన సురేష్‌ ఇంజినీరింగ్‌లో నాలు గేళ్లు కష్టపడి చదివాడు. చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉన్నాడు. తరగతులు, ప్రయోగశాలకు క్రమం తప్పకుండా హాజరై సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ చూపి ఏడాదికి రూ.25 లక్షల వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాడు.

స్వేచ్ఛ మరింత దుర్వినియోగం
ఇంటర్మీడియట్‌ వరకైనా కొంత నియంత్రణ ఉంటుంది. ఇంటర్‌ పూర్తి చేసిన తరువాత ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, పీజీ, బీఎస్సీ, ఫుడ్‌సైన్స్, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు ఎక్కువగా స్వేచ్ఛ లభించే దశ ఇది. దీనిని సద్వినియోగం చేసుకునేవారు బాగా చదివి తల్లిదండ్రులు గర్వించేలా మంచి స్థానాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి రాణించి జీవితంలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే రెండోవైపు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక ఆనందాలకు ప్రాధాన్యమిస్తూ చదువుపై శ్రద్ధ చూపకుండా విద్యార్థులు దారితప్పుతున్నారు.

ఆకర్షణను ప్రేమగా భావించి చదువును పాడుచేసుకుంటున్నారు. ప్రేమను తిరస్కరించారని దాడులు చేయడం, బలవన్మరణాలకు పాల్పడడం చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ను విజ్ఞానం పెంచుకోవడానికన్నా వినోదానికి ఎక్కువగా వాడుతున్నారు. తెల్లవారుజాము వరకు సినిమాలు, వీడియోలు చూడడానికి ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. రాత్రులు సరిగా నిద్రపోకుండా తరగతులకు వచ్చి ఏకాగ్రతతో అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినలేకపోతున్నారు. మద్యం తాగుతూ షికార్లు తిరుగుతూ కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ విలువైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.


అరకొర అయితే.. అంతే
అరకొరగా చదివి బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులైన కోర్సు పూర్తి చేసిన వారికి తరువాత సరైన ఉద్యోగాలు లభించడం లేదు. తగిన నైపుణ్యాలు లేవని తిరస్కరణకు గురవుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లి తల్లిదండ్రులు అప్పు చేసి ఇచ్చిన రూ.లక్షల ఫీజులు చెల్లించి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. మూడు, నాలుగేళ్ల తరువాత చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా, తాత్కాలిక ఆకర్షణలకు గురి కాకుండా కోర్సుల్లో చేరిన మొదటి నుంచే కష్టపడి చదవుతూ నైపుణ్యాలు, పెంచుకుని పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు బాగా లభిస్తున్నాయి. తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో సత్తా చాటి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. అనంతరం ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి కన్నవారికి గర్వంగా నిలుస్తున్నారు.

పక్కదారి పడితే భవిష్యత్‌ అంధకారమే
యుక్త వయసులో హోర్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి విద్యార్థులు దారి తప్పే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులు పిల్లల నడవడిక గమనిస్తూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడాలి. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించి వారి వ్యవహారశైలిని పర్యవేక్షించాలి. నాలుగు నుంచి ఆరేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్‌ లభిస్తుందన్న విషయాన్ని వివరించి చెప్పాలి. 
 – డా.పాండురంగస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి.

గారాబం పనికిరాదు
పిల్లలను అతిగారాబం పనికిరాదు. ఇదే వారు పాడైపోవడానికి కారణమవుతోంది. పాఠశాల దశ నుంచే పిల్లల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించాలి. పిల్లలకు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పదనాన్ని తెలియజేయాలి. పెద్దలను గౌరవించడం నేర్పాలి. మంచి స్నేహితుల అవసరాన్ని తెలుసుకునే విధంగా చూడాలి.
– గోపినాయక్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 

సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి
విద్యార్థులు ఎక్కువగా సెల్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. దీనిని చాలా తక్కువగా వాడితే మంచిది. పిల్లలను కళాశాలల్లో చేర్పించి ఇక తమ బాధ్యత ముగిసిందని తల్లిదండ్రులు భావించకూడదు. నెలలో కనీసం రెండుసార్లు అయినా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థి గురించి తెలుసుకోవాలి. అవసరాలకు మించి డబ్బు ఇవ్వకూడదు. స్ఫూర్తిదాయకమైన, విజయవంతమైన వ్యక్తుల గురించి పిల్లలకు వివరిస్తూ ఉండాలి.         – కోటేశ్వరరావు, అసిస్టెంట్‌ స్టేట్‌ ఆర్గనైజర్‌ కమిషనర్, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ 

మరిన్ని వార్తలు