పసికందును కృష్ణానదిలోకి విసిరి..

2 Jun, 2014 00:23 IST|Sakshi
పసికందును కృష్ణానదిలోకి విసిరి..

తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో కానీ నవమాసాలు కడుపున మోసి, కని, ఐదు నెలలు అల్లారుముద్దుగా పెంచి, అన్నప్రాసన చేయాల్సిన సమయంలో కన్నబిడ్డను ప్రకాశం బ్యారేజి పైనుంచి అమాంతం కృష్ణానదిలోకి విసిరేసింది. ఒక్క మగ్గు నీళ్లు నెత్తిన పడితేనే ఉక్కిరి బిక్కిరవుతారు పసిబిడ్డలు.
 
  అట్లాంటిది 30 అడుగులు ఎత్తు నుంచి గాలిలో తేలుతూ, పడుతూ లేస్తూ అమాంతం నీళ్లలో పడి అడుగుకు చేరిన ఓ పసికందు.. మానవత్వం పరిమళించిన ఓ ఆటో డ్రైవర్ సాహసం పుణ్యమా అంటూ మృత్యుంజయురాలైంది. బిడ్డకు భయమేస్తే లాలించి హత్తుకుని అక్కున చేర్చుకునే అమ్మ ఉలుకు పలుకులేకుండా పడిపోయి కనిపించింది. ఆదివారం మిట్టమధ్యాహ్నం ప్రకాశం బ్యారేజిపై జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
 ఏం జరిగిందేంటే..
 గుంటూరుకు చెందిన లింగాల నాగసుజాత. కన్నబిడ్డకు మురిపెంగా ‘ఆకాంక్ష’ అనే పేరు పెట్టుకుంది. ఏకాంక్ష తీరకుండానే ఆ బిడ్డను ఆదివారం కృష్ణానదిలోకి విసిరేసింది. బిడ్డను కృష్ణానదిలోకి విసిరేయడం చూసిన ఆటోడ్రైవర్ పోతినేని మురళీకృష్ణ ఆటోను ఆపి అమాంతం నీళ్లలో దూకి, బిడ్డను రక్షించాడు.
 
 ఈ లోగానే తల్లి నాగసుజాత కూడా ఎగిరి కృష్ణానదిలో దూకింది. ఆమెను రక్షించేందుకు అటుగా వెళుతున్న ఎం.విజయకుమార్ అనే యువకుడు నదిలోకి దూకాడు. ఎంతో ప్రయాసపడి నీట మునిగిన ఆమెను రక్షించి, బ్యారేజి గేట్లపైకి చేర్చాడు. కేర్ కేర్ మంటూ ఏడుస్తున్న బిడ్డ ఒకవైపు, నీళ్లు తాగి కోమాలోకి వెళ్లిన తల్లి మరోవైపు... ఇలా.. రెండు గంటలపాటు ఇద్దరు యువకులు తాము రక్షించిన తల్లీబిడ్డలతో బ్యారేజి గేట్లపైనే సహాయం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు.
 
  చివరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక జాలర్ల సహాయంతో వారిని పైకి తీసుకువచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాగసుజాత భర్త పవన్ ఆస్పత్రికి వచ్చి ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకున్నాడు. పుట్టింటికంటూ ఉదయం 9 గంటలకు తన భార్య బిడ్డతో సహా బయటకు వచ్చిందని, ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో తెలియదని అంటున్నాడు పవన్. నాగసుజాత చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే కీచులాటలు తప్ప పెద్ద గొడవలేం లేవనేది అతని వాదన. సుజాత స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదు.

>
మరిన్ని వార్తలు